ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆగస్టు 15న ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మొత్తం 33 మున్సిపాలిటీల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జరిపిన రివ్యూలో.. ఈనెల పదో తేదీలోగా వంద క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. రాబోయే వారంరోజులపాటు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మరో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబరు నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు మీదుగా అన్న క్యాంటీన్లు పేరు పెడతారా లేక డొక్కా సీతమ్మ పేరు పెడతారా అన్నది కొంత సస్పెన్స్‌గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. డొక్కా సీతమ్మ పేరును ప్రభుత్వ పథకాల్లో ఒకదానికి పెట్టాలని ప్రతిపాదించారు. అన్న క్యాంటీన్లకే ఈ పేరు పెడతారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో.. అన్న క్యాంటీన్లతో పాటు.. డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తారనే టాక్ నడిచింది.
కానీ.. చివరకు అన్న క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2019 వరకు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లనే కొనసాగించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్. డొక్కా సీతమ్మ పేరును.. ఏపీలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ఖరారు చేసింది ప్రభుత్వం. ఆంధ్రా అన్నపూర్ణగా పిలిచే.. డొక్కా సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం సరైనదేనని పవన్ పేర్కొన్నారు.