వరంగల్, కరీంనగర్ జిల్లాల పబ్లిక్కు గుడ్ న్యూస్

గ్రేటర్ వరంగల్, కరీంనగర్లో వందల కోట్ల విలువ చేసే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్​ పనులు పూర్తి చేసేందుకు మరో అవకాశం దక్కింది. గతంలో ప్రారంభించి ఈ ఏడాది మార్చి 31 నాటికి పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేయడానికి డిసెంబర్‍ నెలాఖరును డెడ్‍లైన్‍గా విధించారు. ఎట్టి పరిస్థితుల్లో మరో అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పారు. మంగళవారం గ్రేటర్ వరంగల్‍ స్మార్ట్ సిటీ కార్పొరేషన్‍ లిమిటెడ్‍ చైర్మన్‍ టీకే శ్రీదేవి అధ్యక్షతన జరిగిన 29వ స్మార్ట్ సిటీ బోర్డ్ మీటింగ్​లో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. నేడోరేపో కరీంనగర్‍ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే రెండు నగరాల్లోని స్మార్ట్ పనులపై బల్దియా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


కాంగ్రెస్‍ సర్కార్ చొరవతో గడువు పెంపు..
స్మార్ట్ సిటీ పథకం అమలుకు గ్రేటర్ వరంగల్ సిటీ 2017లో ఎంపికైంది. ఐదేండ్ల ప్రాజెక్టులో కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.500 కోట్లు మొత్తం రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కరీంనగర్​లోనూ ఇదే పద్ధతిలో స్మార్ట్​ సిటీ పనులు చేపట్టారు. కాగా, కేసీఆర్‍ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.500 కోట్లు ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, బిల్లులు పంపకపోవడంతో పనులన్నీ ఏండ్ల తరబడి సాగాయి. ఈక్రమంలో 2024 మార్చిలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్​ ముగిసినట్లు కేంద్రం ప్రకటించింది.

కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్‍ స్థానంలో వచ్చిన కాంగ్రెస్‍ సర్కార్​ వరంగల్, కరీంనగర్‍లో స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవడంతో మొదట్లో 2025 మార్చి, ఆపై జులై 11 వరకు గడువు ఇచ్చారు. టెండర్ల దశలో ఉన్న కొత్త పనులతో పాటు ఇప్పటికే ప్రారంభించి కొనసాగుతున్న పనులకు సంబంధించి ఫండ్స్ కేటాయింపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. మిగతా పనులను ప్రత్యేక సంస్థల(ఎస్పీవీ) ద్వారానే పూర్తి చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్​ ఎంపీ కడియం కావ్య ప్రాజెక్ట్ గడువును మరికొంత పెంచాలని ఆగస్ట్ లో జరిగిన పార్లమెంట్‍ సమావేశాల్లో కేంద్రాన్ని కోరారు. దీంతో జులై 11 తర్వాత పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులు పెట్టేందుకు ఈ నెలాఖరు వరకు, పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేసేందుకు డిసెంబర్‍ నెలాఖరు నాటికి చివరి అవకాశం దక్కింది.

కరీంనగర్​లో రూ.115 కోట్ల పనులకు మోక్షం..
కరీంనగర్‍ స్మార్ట్ సిటీ పథకంలో గడువు నాటికి దాదాపు రూ.100 కోట్ల పనులపై ప్రభావం పడింది. నగరంలో రూ.1,094 కోట్ల నిధుల్లో రూ.979 కోట్లతో 49 పనులు పూర్తి చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. రూ.115 కోట్లతో చేపట్టిన 12 పనులు పూర్తి చేయలేకపోయారు. రూ.38 కోట్లతో టూరిస్టులను ఆకర్షించేలా టవర్ సర్కిల్ ప్రాంతంలో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ చేసి ఎలివేషన్, కలర్ ఫుల్‍ లైటింగ్‍ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని భావించినప్పటికీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

రూ.26 కోట్ల యూజీడీ పనులు, కేబుల్‍ బ్రిడ్జి సమీపంలో రూ.16 కోట్ల ఇంటిగ్రేటెడ్‍ కమాండ్‍ కంట్రోల్‍ సెంటర్, కశ్మీర్‍గడ్డ వద్ద రూ.10 కోట్ల మార్కెట్, రూ.7 కోట్లతో డిజిటల్‍ లైబ్రరీ, రూ.8 కోట్లతో స్మార్ట్ క్లాస్‍ రూమ్స్, రూ.2 కోట్లతో బాలసదనం వర్స్క్, రెయిన్‍ వాటర్‍ హార్వెస్టింగ్‍ కోసం పిట్స్ ఏర్పాటు గడువులోగా పూర్తి చేయలేకపోయారు. రూ.26 కోట్ల విలువైన సాలిడ్‍ వేస్ట్ మేనేజ్​మెంట్‍ ప్రాజెక్ట్, ట్రాఫిక్‍ కంట్రోల్, ట్రాన్స్​పోర్టేషన్, మొబిలిటీ రెగ్యులేటరీ వంటి పనులు మొదలేపెట్టలేదు. ఈ క్రమంలో గడిచిన రెండు నెలల్లో కొన్నిపనులు ముందుకుసాగగా, మిగిలిన వాటిని ముట్టుకోనేలేదు. ప్రస్తుతం పాత బిల్లుల కేటాయింపుతో పాటు మరిన్ని వర్స్క కంప్లీట్‍ చేసుకునేందుకు 3 నెలలు అవకాశం వచ్చిన నేపథ్యంలో కరీంనగర్ బల్దియా అధికారులు పెండింగ్‍ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది.

వరంగల్లో రూ.219 కోట్ల ఫండ్స్, 38 వర్క్స్..
గ్రేటర్ వరంగల్‍ సిటీలో రూ.944.67 కోట్లతో 108 ప్రాజెక్టులు చేపట్టారు. జులై 11 నాటికి రూ.542.29 కోట్లతో చేపట్టిన 70 పనులు పూర్తయ్యాయి. రూ.328.96 కోట్లతో చేపట్టిన 34 పనులు కొనసాగుతున్నాయి. రూ.73.43 కోట్లతో చేపట్టిన 4 పనులు టెండర్‍ దశలో ఉన్నాయి. వీటికి కేంద్రం నుంచి రూ.123.13 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.96.33 కోట్లతో కలిపి రూ.219.46 కోట్ల పనులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో రూ.41.69 కోట్లతో చేపట్టిన ఐదు ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులు, రూ.16.74 కోట్లతో చేపట్టిన 11 రోడ్ డెవలప్‍మెంట్‍ వర్క్స్, భద్రకాళి చెరువులో రూ.11 కోట్లతో చేపట్టాల్సిన మ్యూజికల్‍ లైటింగ్, రూ.4 కోట్లతో ప్లానిటేరియం పనులపై ప్రభావం పడింది.

వీటితో పాటు రూ.328 కోట్ల విలువ చేసే 34 పనుల్లో రూ.84.2 కోట్ల భద్రకాళి బండ్, రూ.34.05 కోట్ల వడ్డెపల్లి బండ్, రూ.15.23 కోట్ల ఉర్సుగుట్ట చెరువు సుందరీకరణ, స్ట్రోమ్‍ వాటర్‍ డ్రైనేజీలు వంటి పనులపై ఎఫెక్ట్ పడింది. అధికారులు మాత్రం గత రెండు నెలల్లో పలు పెండింగ్‍ పనులు పూర్తి చేశామని, రూ.119 కోట్ల71 లక్షల విలువ చేసే 18 పనులు పురోగతిలో ఉన్నట్లు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.