ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కీలక ముందడుగు వేసింది. కౌశలం పేరుతో సర్వేను నిర్వహించి నిరుద్యోగుల సమాచారాన్ని సేకరించింది.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ-వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత కౌశలం పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తొలి విడత పరీక్షలు మంగళవారం నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరుగుతాయి. అభ్యర్థులకు వారి ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు.. పరీక్ష ఎప్పుడు, ఎక్కడ రాయాలో వివరాలు ఉంటాయి. పరీక్షలు డిసెంబర్ 2 అంటే నేటి మొదలయ్యాయి. ప్రతిరోజూ ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ పరీక్ష రాస్తారు.
ఒక్కో బ్యాచ్‌లో ఇద్దరు అభ్యర్థులు ఉంటారు. పరీక్షలు సచివాలయాల్లోనే జరుగుతాయి. అక్కడ వెబ్ కెమెరాలు, హెడ్‌సెట్‌లు వంటివి సిద్ధం చేశారు. అభ్యర్థులు తమకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలి. ఈ నియామకాలు అభ్యర్థుల విద్యార్హతను, పరీక్షలో వారి ప్రతిభను బట్టి ఉంటాయి. పరీక్ష ఫలితాలను రెండు రకాలుగా విభజించి మూల్యాంకనం చేస్తారు. దీని ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ వర్క్ ఫ్రం హోం పథకం వల్ల చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పరీక్ష సమయాలు (2 Shifts): ఉదయం 11:00 – 12:00, మధ్యాహ్నం 3:00 – 4:00
ఈ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా.. అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించడానికి 15 నిమిషాల వ్యవధి కేటాయించారు. ఈ పరీక్షలో భాగంగా మూడు ప్రశ్నలకు ఇంగ్లిష్ లో 30 సెకన్ల పాటు మాట్లాడి సమాధానం చెప్పాలి. ఈ మొత్తం ప్రక్రియ వెబ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. పరీక్ష రాసేటప్పుడు కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సెస్ తప్పనిసరిగా ఉండాలి. కేటాయించిన సెంటర్ (సచివాలయం) లోని కెమెరాలో పరీక్ష రాసేవారు తప్ప ఇతరులు కనిపిస్తే అనర్హులుగా ప్రకటిస్తారు. మొత్తం స్కిల్ అసెస్మెంట్ 45 నిమిషాల్లో పూర్తి చేయాలి.
ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సైకోమెట్రిక్ ఎవాల్యుయేషన్, మరియు మీ విద్యార్హత ప్రొఫైల్ ఆధారంగా వ్యక్తిగతీకరించిన టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాలను సమగ్రంగా అంచనా వేస్తారు. అభ్యర్థులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నియామకాల్లో పారదర్శకతను పెంచుతుంది. మొత్తం మీద ప్రభుత్వం కౌశలం పరీక్షల్ని నిర్వహిస్తోంది.
కౌశలం సర్వేలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. 18 ఏళ్లు పైబడిన పదో తరగతి ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ యువత వివరాలను సేకరించారు. వారి విద్యార్హత, ఆసక్తిని బట్టి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ప్రోత్సాహకంగా కొంత మొత్తాన్ని అందించి, వర్క్‌ఫ్రం హోం ద్వారా స్థిర ఆదాయం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కౌశల సర్వేలో భాగంగా, పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, బి.టెక్, డిప్లొమా, ఐటీఐ చదివిన నిరుద్యోగులకు ప్రాథమికంగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వారి ప్రతిభ, ఆసక్తిని గుర్తించి, తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అన్వేషిస్తారు. ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత ఉద్యోగానికి అవసరమైన అర్హతను నిర్ణయించి, వర్క్‌ఫ్రం హోం ద్వారా స్థిరమైన ఆదాయం సంపాదించుకునేలా చూస్తారు. ఈ శిక్షణతో యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని అధికారులు తెలిపారు.
































