గ్రామీణ ప్రాంత ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాల వైపు పరుగులు పెడుతున్నారు. కుటుంబాలను ఊరిలో వదిలేసి చాలా మంది కూలీ పనుల కోసం నగరాల బాట పడుతున్నారు. సంపాదన కోసం పిల్లల్ని పెద్దల దగ్గర విడిచిపెట్టి.. భార్యా భర్తలు మాత్రమే సిటీల్లో దొరికిన పని చేస్తూ బతుకు ఈడుస్తున్నారు. ఇలాంటి సమస్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని తీసుకు వచ్చింది. గ్రామాల ప్రజలకు పని కల్పించింది. పల్లె వాసులు పట్టణాల వైపు పరుగులు పెట్టకుండా ఉండేందుకు ఇది ఎంతో కొంత సాయ పడుతుంది. దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది ఈ పథకం. 2005లో ఈ ఉపాధి హమీ పథకాన్ని ప్రారంభించింది అప్పటి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.
అప్పటి నుండి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతుంది. అయితే ఎన్నికల ముంగిట తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపాధి హమీ కూలీలకు కేంద్రం తీపి కబురు అందించింది. రోజువారీ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు అంటే ఏప్రిల్ 1 నుండి ఈ వేతనం పెరగనుంది. ఏపీ ఉపాధి హమీ కూలీలకు వేతనం రూ. 300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత వేతనం రూ. 272గా ఉంది. దీనికి 28 రూపాయలు జోడించి.. 2023-24 సంవత్సరానికి గానూ రూ. 300 అందించనుంది. అలాగే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా అందజేసే సొమ్మును నేరుగా కాకుండా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆయా ప్రభుత్వాలు నిర్ణయించాయి.
కూలీల ఆధార్ సంఖ్యతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేలా చేయనున్నారు. కాగా, ఈ పథకం అమలైన మొదట్లో దినసరి కూలీలకు రూ.87.50 వేతనం అందించారు. పలుమార్లు పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత.. 2022లో రూ.12, 2023లో రూ.15 కూలీని పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తమ గ్రామాల్లోనే పనులు చేసుకునే అవకాశం కలిగింది. అయితే వేసవిలో ఎక్కువగా పనులు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రజలు.