ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే (NH-365BG) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా సంక్రాంతి పండగ కానుకగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ప్రారంభించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదిగో…
హైదరాబాద్ – వైజాగ్ దూరం తగ్గుతుంది:
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే విజయవాడ మీద నుండి దాదాపు 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. దీనికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. అయితే, ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే ప్రయాణ దూరం 125 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే ప్రయాణ సమయం కూడా సుమారు 5 గంటల వరకు తగ్గుతుంది.
ఈ హైవే నిర్మాణ మొత్తం పొడవు 162.10 కిలోమీటర్లు. ఇందుకు బడ్జెట్ సుమారు రూ.4,609 కోట్లు. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని దేవరపల్లి వరకు ఈ రోడ్డును 4 వరుసలుగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) భావిస్తోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 56.88 కిలోమీటర్ల మేర ఈ రహదారి సాగుతుంది. చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించి, కన్నాయగూడెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో ఏలూరు జిల్లాలోని యర్రంపేట, కన్నాయగూడెం ప్రాంతాల్లో కోర్టు కేసుల వల్ల 2 కిలోమీటర్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ హైవే పూర్తయితే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా చేసే వాహనాలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది.



































