తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. వచ్చే నెల అంటే.. ఏప్రిల్ నుంచి వారికి గతంలో ఇచ్చినట్లే కంది పప్పు విధిగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
రెండు, మూడు నెలలుగా రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు సరిగా అందడం లేదు. దీంతో అధికారులు కందిప్పు అంశంపై దృష్టిసారించారు. ఏప్రిల్లో కందిపప్పు పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం మూడు జిల్లాల్లోనే కంది పండుతోంది. ఆ మూడు జిల్లాల నుంచే కంది పప్పును కొనుగోలు చేసి ప్రభుత్వం రాష్ట్రమంతటా సరఫరా చేయాల్సి ఉంది. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకుతోందని ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు కంది రైతులు తమ పంటను అమ్మేస్తున్నారు.
దీంతో ప్రభుత్వం వద్ద ఉన్న కంది నిల్వలు సరిపోవడం లేదు. మహారాష్ట్రం నుంచి కందిపప్పు తెప్పించి ఇస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు కందిపప్పు సరఫరా చేసినా.. సుమారు 50 శాతం మందికి అందింది. మార్చి నెలలో ఎవరికీ కందిపప్పు అందించలేదు. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి డిపోల ద్వారా పూర్తి స్థాయిలో బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు పంపిణీ చేశారు. జనవరిలో కందిపప్పు పప్పు పంపిణీ అంతంతమాత్రంగానే జరిగింది. మార్చిలో పంచదార, బియ్యం మాత్రమే ఇచ్చారు. రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రూ.67కే ఇస్తుండగా, బహిరంగ మార్కెట్‌లో ధర రూ.120 నుంచి రూ.160 వరకు ఉంది. దీంతో వినియోదారులు సైతం రేషన్ షాపుల్లోనే కంది పప్పు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కంది పప్పు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అంతే కాకుండా మారుతున్న ఆహారపు అలవాట్లకు తగిన విధంగా పేదలకు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాగుల ఉత్పత్తి సరిపడా లేదు, అందుకే రాయలసీమకు మాత్రమే రాగుల పంపిణీని పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జొన్నలు అందించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని జిల్లాల్లో ప్రజలు జొన్నలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతేడాది అక్టోబరు నుంచి కందిపప్పు, గోధుమ పిండి సరఫరాను పునరుద్ధరించారు. కానీ స్టాక్ లేకపోవడంతో కంది పప్పును మార్చి నెలలో ఇవ్వలేకపోయారు. మరి ఏప్రిల్‌లో అయినా పూర్తి స్థాయిలో కంది పప్పును ప్రతి కార్డు దారుడికి ఇస్తారా లేదో చూడాలి.