ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త. రాష్ట్రంలో పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జనవరి 1 నుంచి కేజీ గోధుమ పిండి కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. కేవలం 5 నిమిషాల్లోనే పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపారు. దీపం 2 పథకం కింద మూడో విడత పంపిణీ నవంబర్ 30 వరకు కొనసాగుతుందని, మొంథా తుఫాను బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.
స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తయిందని, మిగిలిన వాటిని మనమిత్ర యాప్ ద్వారా అర్హులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 2,39,169 కుటుంబాలకు మొంథా తుఫాను తర్వాత పౌరసరఫరాల శాఖ నిత్యావసర సరుకులు అందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్మార్ట్ కార్డుల పంపిణీలో 92 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. మిగిలిన కార్డులను నెల చివరిలో వెనక్కి తీసుకుని, మనమిత్ర యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలించి అందిస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో కీలక సంస్కరణలు చేపట్టామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశామన్నారు. దళారుల ప్రమేయాన్ని తగ్గించి, రైతులకు న్యాయం జరిగేలా పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించామన్నారు. రైతులతో చర్చించి, వారి సమస్యలను అర్థం చేసుకుని, ఈ సంస్కరణలు అమలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తేమ శాతం విషయంలో గతంలో పారదర్శకత లేకపోవడం వల్ల రైతులు నష్టపోయేవారని, ఇప్పుడు తీసుకువచ్చిన మార్పులతో వారికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఈ సంస్కరణలు దానిలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పటిష్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం విస్తృతమైన యంత్రాంగాన్ని సిద్ధం చేశామని ఆయన వివరించారు. 4041 రైతు సేవా కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు తమ ధాన్యాన్ని సులభంగా అమ్ముకోవడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగడానికి 16,700 మంది సిబ్బందిని నియమించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి 6 కోట్ల గోనె సంచులను సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తద్వారా ధాన్యం నిల్వలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
































