తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి ఓ గుడ్ న్యూస్ చెప్తుంది. తాజాగా టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లో నిరీక్షించే పరిస్థితికి చెక్ పెడుతూ టిటిడి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తిరుమలలో ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద విఐపి బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులతో, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిఫార్సు లేఖలను అందజేసిన భక్తుల మొబైల్ ఫోన్లకు ఒక లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతోంది. ఆ లింకును ఓపెన్ చేస్తే అందులోనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది.
దీంతో మొబైల్ ఫోన్ నుండి నగదు చెల్లించి టిక్కెట్ ను మొబైల్ లోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా టిటిడి రెండు రోజుల నుంచి అమలు చేస్తోంది. అయితే ఈ విధానంపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్న టిటిడి ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఈ విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే మరోవైపు తిరుమలలో ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతుంది. ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలు రాగా, నిన్న ఈ ధార్మిక సదస్సులో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని నిన్న టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ధార్మిక సదస్సులో పాల్గొన్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా, మూడుసార్లు టిటిడి బోర్డు సభ్యుడిగా అయ్యానని తెలిపారు. తన ద్వారా ఇటువంటి గొప్ప పనులు చేయించాలనే స్వామి వారు తనకీ అదృష్టాన్ని ఇచ్చారని, ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్పిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని సనాతన హైందవ ధర్మం ఫరిడవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.