దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం అయిన జొమాటో గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఈ సంస్థ విజయపథంలో దూసుకుపోతోంది.
మనం తినాలనుకుంటున్న భోజనాన్ని నచ్చిన హోటల్ నుంచి తీసుకువచ్చి క్షణాల్లో అందజేస్తుంది. గతంలో నగరాలు, పట్టణాల్లో జొమాటో సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేవారు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మండల కేంద్రాలకూ ఇవి చేరువయ్యాయి. ప్రస్తుతం దీని సేవలు దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు వందకు పైగా రైల్వే స్టేషన్లకు విస్తరించాయి.
ఆర్డర్ చేసిన వెంటనే..
ప్రస్తుతం మనిషి కాలంతో పోటీ పడి పరుగెడుతున్నాడు. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాలలో ఇది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హోటల్ కు వెళ్లి భోజనం చేసే సమయం కూడా కొందరికి ఉండడం లేదు. అలాగే నగరానికి కొత్త వచ్చిన వారు, ఇంటి నుంచి బయటకు రాలేని వారు, పెద్దవాళ్లు, మహిళలు ఇలా ఎందరో జొమాటో సేవలు పొందుతున్నారు. ఆర్డర్ చేసిన తక్కువ సమయంలో ఈ సంస్థ సిబ్బంది మన ఇంటికి తీసుకువచ్చి. ఫుడ్ అందజేస్తున్నారు. అలాగే రైళ్లలో ప్రయాణించే వారికి జొమాటో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ను రైల్వే స్టేషన్ లో మన కోచ్ దగ్గరకు వచ్చి సిబ్బంది అందజేస్తున్నారు. ఈ సదుపాయం రైలు ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగపడుతోంది.
రైలు డెలివరీ సర్వీస్..
జొమాటో అందిస్తున్న రైలు డెలివరీ సర్వీస్ ఇప్పుడు దేశంలోని 100 పైగా రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) భాగస్వామ్యంతో జొమాటో ఈ సేవలను అందజేస్తోంది. దేశవ్యాప్తంగా వందకు పైగా రైల్వే స్టేషన్లకు జొమాటో సిబ్బంది వెళ్లి, కోచ్ లలో ప్రయాణిస్తున్న వారికి నేరుగా ఫుడ్ డెలివరీని చేస్తున్నారు. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే రైళ్లలో పది లక్షలకు పైగా ఆర్డర్లను అందజేశామని తెలిపారు. రైలు ప్రయాణికులందరూ తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
పది లక్షలకు పైగా డెలివరీలు..
జొమాటో సంస్థ ఇప్పటి వరకూ రైళ్లలో పది లక్షలకు పైగా ఆర్డర్లను విజయవంతంగా అందజేసింది. సుదూర ప్రయాణం చేస్తున్న రైలు ప్రయాణికులకు ఈ సేవ బాగా ఉపయోగపడుతోంది. వారికి నచ్చిన ఫుడ్ తినే అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జొమాటో అందిస్తున్న సర్వీస్ కు ప్రజాదరణ, డిమాండ్ కూడా పెరుగుతోంది.
రైలు డెలివరీ సర్వీస్ పొందాలంటే..
రైలు ప్రయాణికులు జొమాటో కు ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఈ కింది తెలిపిన పద్ధతిని పాటించాలి.
జొమాటో యాప్ ను ఓపెన్ చేయాలి.
డెలివరీ సెర్చ్ బార్ లో మీరు ప్రయాణిస్తున్న రైలును నమోదు చేయాలి. అనంతరం “మీల్స్ ఎట్ ట్రైన్ సీట్ ‘ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
పది అంకెల పీఎన్ ఆర్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్న స్టేషన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అందుబాటులోని ఎంపికల నుండి రెస్టారెంట్‌ను ఎంచుకోండి, మెనూ కార్ట్‌లో మీకు కావాల్సిన ఫుడ్ ను ఎంటర్ చేయండి.
మీ రైలు కోచ్, సీట్ నంబర్ ను సక్రమంగా ఎంటర్ చేయాలి. డెలివరీ తర్వాత చెల్లింపును ఎంచుకోండి.