కేంద్ర రైల్వే శాఖ( railway department) కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. సంస్కరణలను అమలు చేస్తోంది. ఏపీ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తోంది.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. అమరావతికి కనెక్టివిటీ పెంచుతూ రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలుగా ఉన్న హైదరాబాద్, విశాఖ మధ్య మరిన్ని రైల్వే సర్వీసులను నడిపేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సికింద్రాబాద్, విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలులో బోగీల సంఖ్య పెంచాలని డిసైడ్ అయింది. ఈ రైలుకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్, విశాఖ( Visakhapatnam) మధ్య నడిచే వందే భారత్ రైలులో ప్రస్తుతం 16 బోగీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదనంగా మరో నాలుగు బోగీలు ఏర్పాటు చేశారు. ఈరోజు నుంచి వందే భారత్ రైలు 20 బోగీలతో నడవనుంది. ఈ రూట్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర రైల్వే శాఖ. గతంలో 14 ఏసీ చైర్ కార్, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు ఉండేవి. అయితే ఏసీ చైర్ కార్ బోగీలు 18కి పెంచుతున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లు మాత్రం యధాతధంగా కొనసాగనున్నాయి. వారంలో ఆరు రోజులు పాటు మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం దీనికి సెలవు.
రైలు షెడ్యూల్ ఇదే..
ప్రతిరోజు సికింద్రాబాద్ లో( Secunderabad) ఉదయం 5:05 గంటలకు బయలుదేరుతుంది. వరంగల్ కు 6:38, ఖమ్మం కు ఉదయం 7:43 కు, విజయవాడకు ఉదయం 9 గంటలకు, ఏలూరుకు 9:49 గంటలకు చేరుకోనుంది. ఉదయం 10:48 గంటలకు రాజమండ్రి, 11:18 గంటలకు సామర్లకోట వస్తుంది. మధ్యాహ్నం 13:50 గంటలకు విశాఖ చేరుకొనుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. సామర్లకోటకు 3:48 గంటలకు , రాజమండ్రి కి 4:18 గంటలకు, ఏలూరుకు 5:44 గంటలకు, విజయవాడకు 6:48 గంటలకు, ఖమ్మం కు రాత్రి 8:04 గంటలకు, వరంగల్ కు 9:03 గంటలకు, సికింద్రాబాద్కు రాత్రి 11:25 గంటలకు చేరుకోనుంది.
































