సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇక ఇంటి వద్దకే..

క్షిణ మధ్య రైల్వే పార్సిల్ రవాణా సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. సరకు రవాణాను మరింత సులభతరం చేస్తూ.. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇంటి వద్దనే పికప్, డెలివరీ సౌకర్యం కల్పించే అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు బుధవారం ప్రకటించింది.


ఈ నూతన విధానం ద్వారా.. ఇకపై రైలు ద్వారా పార్సిళ్లు బుక్ చేసుకోవాలనుకునేవారు రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఈ సమగ్ర సేవను అందించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే అప్లికేషన్ ఆధారిత పార్సిల్‌ లాజిస్టిక్స్‌ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైల్వే రవాణాలో ఉన్న మూడు కీలక దశల ద్వారా సరుకు రవాణా చేయనున్నారు. సరుకులను ఇంటి వద్ద పికప్ చేయడం (ఫస్ట్‌మైల్‌), రైలు ద్వారా రవాణా (మిడ్‌మైల్‌), గమ్యస్థానంలో ఇంటికి డెలివరీ చేయడం (లాస్ట్‌మైల్‌) అన్నీ ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. ఈ ఏకీకృత వ్యవస్థ రవాణా ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఈ వినూత్న కార్యక్రమాన్ని తొలి దశలో హైదరాబాద్‌ డివిజన్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే.. త్వరలోనే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇతర డివిజన్లకు కూడా ఈ సేవలు విస్తరించబడతాయి. ఈ డిజిటల్ సేవకు ప్రధాన సాధనం ‘నెక్ట్స్ జెన్ రైల్ పార్సిల్’ యాప్ ద్వారా జరగనున్నాయి. ఈ యాప్ వినియోగదారులకు పార్సిల్ సరకులను సులభంగా బుకింగ్ చేసుకోవడానికి, తమ సరకులు ఎక్కడున్నాయో ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి వన్‌-స్టాప్‌ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతుంది.

కొత్త సేవలకు అనుగుణంగా ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ డెలివరీలను అందించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సమర్థవంతమైన లాజిస్టిక్స్, ఫ్లీట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను భాగస్వాములుగా ఆహ్వానించింది. ఈ భాగస్వామ్యాల ద్వారా రైల్వేకు అదనపు ఆదాయం సమకూరుతుందని అదే సమయంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు వారి వస్తువులను దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో వేగంగా సురక్షితంగా రవాణా చేసుకునేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ చర్య భారతీయ రైల్వేలను ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగంలో మరింత బలోపేతం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.