ఏపీ గ్రామాల్లో పేదలకు కేంద్రం శుభవార్త..! నవంబర్ 5 వరకే ఛాన్స్

పీలోని గ్రామీణ పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.


రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి పరిమిత గడువు మాత్రమే ఇచ్చింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేర్వేరుగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తోంది. అయితే ముందుగా పీఎంఏవై రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సర్వేలో నమోదు చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా గ్రామీణ ప్రాంతాల పేదలు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి.

దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి పీఎంఏవై-గ్రామీణ పథకం సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం నవంబర్ 5 వరకూ ఈ సర్వే గడుపు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో పీఎంఏవై-గ్రామీణ పథకం కింద ఇళ్ల కేటాయింపుకు సర్వే తిరిగి ప్రారంభించబోతున్నారు. కాబట్టి గ్రామాల్లో ఇళ్లు లేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలు, ఈ పథకం కింద సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు 5 లక్షల మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీరంతా వెంటనే స్థానికంగా ఉండే గృహనిర్మాణ శాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఇళ్లు పొందడానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లు నమోదు చేయించుకుంటే వారి అర్హతల్ని పరిశీలించి త్వరలో కేంద్రం ఇళ్లు కేటాయిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.