సొంత ఇల్లు లేనివారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇల్లు లేని ప్రతిఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి నిర్మాణానికి అందించే అదనపు ఆర్థిక సహాయంను లబ్దిదారులకు వివరించి గ్రుహనిర్మాణాలను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులు దిశానిర్దేశం చేశారు.
సచివాలయంలోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణాల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించారు. జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద చేపట్టిన గృహాలలో పలు దశలో ఉన్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. గృహ నిర్మాణం చేపట్టి పూర్తి అయ్యే దశలో ఉన్న 6,568 గృహాలను త్వరలోనే పూర్తి చేయాలన్నారు.
అసంపూర్ణంగా ఉన్న గృహాల లబ్దిదారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంను అందించాలన్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 16, 406 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని..వీరిలో 6,388 మందికి సంబంధించి రూ. 9.20కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని..మిగిలిన వారికి పథకం వివరాలను వివరించి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
దీంతో పాటు సిమెంట్, స్టీల్ తదితరాలను అందించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి మండలంలోని ఎంపీడీవోలు ఇంటి నిర్మాలకు సంబంధించి యాక్టివ్ బెనిషిషరీలను గుర్తించాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలకు చేసిన ఖర్చు వివరాలు అందించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు అయిన అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో భాగంగా కుప్పం, పలమనేరు, నగరి, పుంగనూరు నియోజకవర్గాల్లో 175 పనులు మంజూరు అయ్యాయయని రూ. 47లక్షలతో 162 పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు పెండింగ్ ఉంటే వారికి కొద్ది ఆర్థికం తోడు చేసి అధికారులు భరోసాగా నిలుస్తూ పేదోడి స్వంతింటి కల నెరవేరేలా చూడాలని కోరారు.