స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్స్‌లో చైనా విప్లవాత్మక ఆవిష్కరణను తీసుకొచ్చింది. భూమిపై ఉన్న సెల్ టవర్ల అవసరం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్‌ను సాధ్యం చేయగలిగేలా ప్రపంచంలోనే మొదటి ఉపగ్రహాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్వర్గంతో కనెక్ట్ అవ్వడం అని అర్థం వచ్చేలా దీనికి ‘టియాంటాంగ్’ అని దీనికి పేరుపెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం చైనా రోదసీలోకి పంపిన ‘టియాంటాంగ్-1’ ఉపగ్రహ శ్రేణి ప్రస్తుతం మూడుకు చేరింది. ఇవి జియోసింక్రోనస్ కక్ష్యలో తిరుగుతూ మొత్తం ఆసియా-పసిఫిక్ ప్రాంతాన్ని కవర్ చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా మొబైల్ శాటిలైట్ కనెక్టివిటీకి మార్గం సుగమమైంది. చైనాకు చెందిన ‘హువావే’ ఇప్పటికే ప్రపంచంలోనే శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మొదటి మొబైల్ కంపెనీగా గుర్తింపు పొందింది. హువావే టెక్నాలజీస్ గతేడాది సెప్టెంబరులో శాటిలైట్ కాల్స్‌కు మద్దతునిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా ఆ జాబితాలో షియోమి, హానర్, ఒప్పో వంటి మొబైల్ కంపెనీలు కూడా చేరాయి. గతేడాది డిసెంబరు 18న చైనాలోని గాన్సు ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. సాంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయలేదు. ఈ సమయంలో బాధితుల్లో కొందరు శాటిలైట్ కాల్ సౌకర్యం ద్వారా బాహ్య ప్రపంచంతో సమాచారాన్ని పంచుకోగలిగారు.