ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం ఆ రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. మిషన్ శక్తి స్కీం కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 27)న ప్రకటించారు. మిషన్ శక్తి బజార్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో మిషన్ శక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ వడ్డీ లేని రుణాలు మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వస్తువుల మార్కెటింగ్ సులభతరం చేయడమే మిషన్ బజార్ లక్ష్యమని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో హస్తకళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, హెల్త్ కేర్ ప్రాడక్ట్, సాంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు ఉత్పత్తులతో సహా 1,000 రకాల ప్రాడక్ట్స్ మిషన్ శక్తి బజార్ అందిస్తుంది.
వడ్డీ వాపస్ కోసం రూ.145 కోట్లు విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో 5,000 మిషన్ శక్తి బజార్‌లను ఏర్పాటు చేయాలని, 70 లక్షల మంది మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులకు రూ. 730 కోట్లు, యూనిఫాంలు మరియు బ్లేజర్‌ల కొనుగోలు కోసం మిషన్ శక్తికి రూ. 1.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. సంఘాలు ఈ ఏడాది రూ. 15,000 కోట్ల రుణాలు పొందాయని, మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నవీన్ పట్నాయక్ అన్నారు. మహిళల ఆర్థిక శక్తిని, నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు.