ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు పరుగులుపెట్టే అవకాశం ఉందట. ఈ రైలు సికింద్రాబాద్ టూ ముంబై నగరాల మధ్య నడుస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంకి సూచించారు. ఈ మేరకు ఆయన రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపించారని తెలిసింది. అటు సికింద్రాబాద్-పూణే మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ సిట్టింగ్ రైలు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ రైలుకు 8 బదులుగా 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీలిస్తోంది. అటు తిరుపతి-నిజామాబాద్ మధ్య నడుస్తోన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్.. ఇకపై బోధన్ వరకు వెళ్లనుంది. అంతేకాకుండా సికింద్రాబాద్-రాజ్‌కోట్ మధ్య రాకపోకలు సాగిస్తోన్న రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను కచ్ జిల్లా వరకు పొడిగించాలని.. ఆ ప్రాంత వాసులు కోరగా.. దక్షిణ మధ్య రైల్వే జీఎం ఈ ప్రతిపాదనపై కూడా పరిశీలన జరుగుతోందని వివరించారు.