ఏ రేషన్ దుకాణం నుంచైనా సరుకులు కొనుగోలు చేయవచ్చు.

కార్డు నమోదైన షాపునకే వెళ్లక్కర్లేదు


లబ్ధిదారులకు సౌకర్యవంతంగా మార్పులు చేశాం

ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రేషన్‌ పంపిణీకి చర్యలు

5 లోపు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్‌

రేషన్‌ దుకాణాలపై వైసీపీది విష ప్రచారం: నాదెండ్ల

తెనాలి/అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ‘‘ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రైస్‌ కార్డు నమోదైన డీలర్‌ దగ్గరే తీసుకోవాలనే నిబంధన లేదు. దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేశాం” అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 1వ తేదీ నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు అందించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లను ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో పరిశీలించారు. రేషన్‌దుకాణంలో సరుకు నిల్వలు, వాటి తూకాలు, ఇతర ఏర్పాట్లను అడిగితెలుసుకున్నారు. డీలరు, రెవెన్యూ, తూనికలు కొలతల శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారుల ఫోన్‌ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంకేతిక సమస్య తలెత్తినా వారిని గంటల తరబడి కూర్చోబెట్టకుండా ఫొటో తీసుకుని సరుకులు ఇచ్చేలా ఆదేశాలిచ్చామన్నారు. గతంలో ఎండీయూ వాహనాలను వీధి చివర్లో ఆపి కొంతసేపు సరుకులు ఇచ్చి కొంతమందికి రేషన్‌ ఇవ్వకుండా మాయం చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. వీటిని నియంత్రించేందుకే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశామన్నారు. రేషన్‌ దుకాణాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

15 రోజులు అందుబాటులో దుకాణాలు

ప్రతినెలా 1 నుంచి 15లోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయని మంత్రి చెప్పారు. ఆ సమయంలో ఎప్పుడైనా రేషన్‌ తీసుకునే వీలుంటుందన్నారు. గతంలో వలే వాహనం కోసం పనులు మానుకుని ఇళ్ల వద్దే ఉండాల్సిన అవసరం లేదన్నారు. వీలున్న సమయంలో రేషన్‌ తెచ్చుకోవచ్చన్నారు. సరుకులు లేవని ఏ ఒక్కరినీ తిప్పిపంపే పరిస్థితి ఉండదన్నారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులైన 15.56 లక్షల కుటుంబాల వారికి ప్రతినెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిస్తామని స్పష్టంచేశారు. ఈ బాధ్యత రేషన్‌ దుకాణదారులే తీసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో 29,760 దుకాణాలను పునరుద్ధరించామన్నారు. తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపినా డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేయాలి

రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ చేసేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా డీలర్లు పని చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కార్డుదారులకు డీలర్లు గౌరవంగా సేవలందించాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్‌ సప్లయిస్‌ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆదివారాల్లో కూడా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి డీలరు ఈ-పోస్‌, వేయింగ్‌ మెషీన్ల పనితీరును ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరుకుల పంపిణీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ-పోస్‌, వేయింగ్‌ మెషీన్ల మరమ్మతుల కోసం ప్రతి జిల్లాలో సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ కార్డుదారులకు సక్రమంగా సరుకులను పంపిణీ చేయాలని మంత్రి చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.