Speaking Practice | చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది.. కానీ భాష రాకపోవడంతో వచ్చీరాని పదాలతో కుస్తీపడుతుంటారు. కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటారు. నిత్య జీవితంలో ఇలాంటి సమస్యలను చాలామంది ఉద్యోగులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి వారికి ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్ ప్రాక్టీస్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఇంగ్లీష్‌ను సులువుగా ప్రాక్టీస్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా భారత్‌తో పాటు అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేసియా, మెక్సికో, వెనిజులా దేశాల్లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుంది?
ఇప్పటికే డ్యూలింగో, బాబెల్ వంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఇంగ్లీష్ నేర్చుకునే యూజర్ లెవల్‌ను బట్టి పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. కానీ గూగుల్‌లో మాత్రం అలాంటిదేమీ ఉండదు. దీని ద్వారా కాంప్రహెన్సివ్ ఇంగ్లీష్ ( సమగ్ర భాష)ను నేర్చుకోలేరు.. కాకపోతే ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ద్వారా రోజువారీ సంభాషణల ఆధారంగానే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయవచ్చు. పదకోశాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్ యాప్ ద్వారా స్పీకింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రశ్నలతో పాటు ఇది ప్రాంప్ట్‌ను కూడా అందిస్తుంది. స్పీకింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రశ్నను నేరుగా అడగవచ్చు లేదంటే టైప్ కూడా చేయవచ్చు. దీనికి ఏఐ సమాధానం ఇస్తుంది. మనం ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో ప్రాంప్ట్‌ను అందజేస్తుంది. అలాగే దానికి ఫాలో అప్ ప్రశ్నలను కూడా చూపిస్తుంది. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ను బట్టే సమాధానాలు వస్తాయి. ఉదాహరణకు మంచి బాడీ షేప్ కోసం ఏం చేయాలని అడగవవచ్చు. అప్పుడు మన సమాధానాన్ని ఎక్సర్‌సైజ్, టైర్డ్, హార్ట్ వంటి వర్డ్స్ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సంభాషణలను పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మిగతా ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్స్‌కు గట్టి దెబ్బ పడటం ఖాయమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ స్పీకింగ్ ప్రాక్టీస్‌లో జాయిన్ అవ్వాలంటే తప్పనిసరిగా గూగుల్ సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత వినియోగదారులు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఆండ్రాయిడ్ మొబైల్‌లోని గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో లెఫ్ట్‌సైడ్ టాప్ కార్నర్‌లో కనిపించే ల్యాబ్ సింబల్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్‌పర్‌మెంట్ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు.