ఉద్యోగుల నోట్లో పంచదార పోస్తున్న చంద్రబాబు

www.mannamweb.com


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో ఔట్ రేట్ గా టీడీపీ కూటమిని సమర్ధించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వారి కోరికలు తీర్చడం మాట పక్కన పెడితే ప్రతీ నెలా మొదటి తారీఖున జీతాలు రావడం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయింది అని తెగ బాధపడ్డారు.

దాంతో తమ జీతాలు సమయానికి వస్తే చాలు అన్నంతగా వారు ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో వారు వైసీపీ మీద గుస్సా అయి టీడీపీ కూటమిని మద్దతు ప్రకటించారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. అయితే ఈ ఏడు నెలలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు.

వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతీ నెలా ఒకటవ తారీఖున జీతాలు వారికి అందేలా చూసుకుంటున్నారు. ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఉద్యోగుల కోరికలు ఇపుడు మెల్లగా బయటకు వస్తున్నాయి.

తమకు కొత్త పీఆర్సీ వేయాలని దాని కంటే ముందు ఇంటీరియం రిలీఫ్ గా కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు. అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి దాకా ఆరేడు డీయేలు బకాయి ఉండిపోయాయని వాటిలో కొన్ని అయినా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

ఇపుడు ఆ కోరికను చంద్రబాబు తీరుస్తున్నారు అని అంటున్నారు. ఈ సంక్రాంతి కానుకగా ఒకేసారి రెండు డీయే బకాయిలను బాబు ప్రకటించనున్నారు అని అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ గానే చూస్తున్నారు

అదే సమయంలో అలానే వేతన సవరణ సంఘం పీఆర్సీ , మధ్యంతర భృతి ఐఆర్ లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దాంతో ఉద్యోగ వర్గాలలో ఆనందం వెల్లి విరుస్తోంది. మొత్తం మీద చూస్తే పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటోంది అని అంటున్నారు.