ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడాలంటే పర్మిషన్ తప్పనిసరి

ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో.. ప్రతీ ఒక్కరు చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో మునిగిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు ఓపెన్ చేసి..


పోస్ట్‌లు పెట్టడం, రీల్స్ చేయడం, వాటిని షేర్ చేయడం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది ఇదే దారి ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది గీత దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, అనుచిత పోస్ట్‌లు పెట్టడం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో.. తీవ్ర ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

బిహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం.. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త సోషల్ మీడియా మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో అనుసరిస్తున్న ప్రవర్తనను క్రమబద్ధీకరించడానికి.. వారు మరింత బాధ్యతగా ఉండేలా చూడడానికి బిహార్ రాష్ట్ర కేబినెట్ ఈ కొత్త నిబంధనలకు ఆమోదం కల్పించింది.

ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు ముందుగా సంబంధిత శాఖ అధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ పోస్ట్‌ల కోసం ప్రభుత్వ లోగోలు, అధికారిక హోదా, ప్రభుత్వ ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలను అసలు ఉపయోగించకూడదు. పేరు తెలియకుండా నకిలీ పేరుతో సోషల్ మీడియా అకౌంట్‌లను మెయింటైన్ చేయడంపై నిషేధం ఉంటుంది.

అశ్లీల కంటెంట్, రెచ్చగొట్టేలా, శాంతికి విఘాతం కలిగించే అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. వీటితోపాటు కుల, మత, వర్గాలను లక్ష్యంగా చేసుకునే పోస్ట్‌లపైనా కఠిన నిషేధం ఉంటుంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలు, ఆఫీసుల్లోని రహస్యమైన, సున్నితమైన ఫోటోలు, వీడియోలు, అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను.. పై అధికారులపై విమర్శలు చేయకూడదు. లైంగిక దాడి జరిగితే బాధితుల వివరాలను చెప్పడం, ఇతరుల పర్సనల్ సమాచారాన్ని షేర్ చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు.

బిహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలను కూడా వెల్లడించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేసే పోస్ట్‌లు అనవసర వివాదాలకు, ప్రభుత్వంపై విమర్శలు తీసుకువచ్చేలా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండడటం, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.