‘టెస్లా’ కోసం భూములు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ, ఆటోమోటివ్, క్లీన్‌ ఎనర్జీ కంపెనీ టెస్లా కార్ల తయారీ పరిశ్రమ కోసం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పోటీపడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్టిఫీషియల్ సాంకేతికతో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలోకి ప్రవేశపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. టెస్లా పరిశ్రమను ఎలాగైనా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు పొడవైన తీరప్రాంతం, పోర్టులు, హైవేలు అనుకూలంగా ఉండడంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా సంప్రదింపులు చేస్తోంది.


పారిశ్రామిక వాడల్లోని భూములు : గతంలో మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సస్‌లోని టెస్లా సంస్థ ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్​లో పెట్టుబడులు పెట్టాలంటూ టెస్లా సంస్థని ఆహ్వానించారు. ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూములను కేటాయించేందుకు రెడీ చేస్తున్నారు.

పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం : ఐదు రోజుల క్రితం ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామికవాడను సందర్శించారు. టెస్లా పరిశ్రమ వస్తే కేటాయించాల్సిన భూమి, అక్కడి వసతులను పరిశీలించారు. మేనకూరు పారిశ్రామికవాడలోని 500 ఎకరాల ఖాళీ భూమిని టెస్లా కోసం కేటాయించేందుకు చూస్తున్నారు. అదే విధంగా తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీతోపాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములనూ టెస్లా కోసం పరిశీలిస్తున్నారు.

మేనకూరు, క్రిస్ సిటీ, శ్రీసిటీ ప్రాంతాలకు చెన్నైకి 120 కిలో మీటర్ల దూరంలో ఉండడం, కృష్ణపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు, జాతీయ రహదారులు దగ్గరగా ఉండడంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. 2016లో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడినా, సీఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌తో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైంది. ఇదే తరహాలో టెస్లా సంస్థను సైతం తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.