ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది.. స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళా ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది..
నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పెచ్చు ఊడిపడడంతో మహిళా టీచర్ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో మృతిచెందింది ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్ (47) గా గుర్తించారు.. స్కూల్ లో ప్రేయర్ అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం పక్కన టీచర్ నిలబడి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.. స్లాబ్ పెచ్చు ఊడిపడిన ఘటనలో టీచర్ జోష్నా భాయ్ తలకు బలమైన గాయం కాగా… రాజానగరం జెడ్పీ హైస్కూల్ నుంచి తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.. మృతురాలిది కాకినాడ జిల్లా తునిగా చెబుతున్నారు..
మరోవైపు, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. స్లాబ్ కూలి ఇంగ్లీష్ టీచర్ మృతి చెందడం బాధాకరం అన్నారు.. రాజానగరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన పట్ల అధికారులతో మాట్లాడిన హోంమంత్రి అనిత.. టీచర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..
































