అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు 100 రోజుల డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో స్కీమ్‌ల ఇంప్లిమెంటేషన్‌పై వేగం పెంచింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంచిన సర్కార్.. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలపై అమలుపై కసరత్తు మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి స్కీమ్‌లో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీ వేళ అధికారులకు దరఖాస్తుదారులు ఆధార్ కార్డ్ తప్పని సరిగా చూపించాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.