త్వరలోనే గవర్నర్ పోస్టులు.. టీడీపీకి-2, జనసేనకు-1

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గవర్నర్ పోస్టులను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు రాష్ట్రాల గవర్నర్‌లను మార్చనున్నట్టు తెలుస్తోంది.


వీటిలో కర్ణాటక, తమిళనా డు, ఏపీ, ఒడిశా, ఢిల్లీ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల పదవీ కాలం పూర్తి కావడం ఒక కారణమైతే.. కేంద్రంలోని కూటమి సర్కారుకు భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ(నితీష్‌కుమార్‌), టీడీపీ(చంద్రబాబు), జనసేన(పవన్ కల్యాణ్‌)లనుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

దీంతో కొందరికి కాలం తీరకుండానే పక్కన పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథ నాలు వస్తున్నాయి. దీనిని బట్టి.. ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీకి ఏపీకి చెందిన నాయకులకు అవకాశం ఉంది. అదేవిధంగా ఒడిశాకు కూడా.. ఒక అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక, తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ తమిళిసైని తిరిగి.. తెలంగాణకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ మీడియా పేర్కొంది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ఆమెను తప్పించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎంపీటికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఓటమి తర్వాత.. ఇప్పుడు మరోసారి గవ ర్నర్ పదవిని ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా ఐదు స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా..(మరో రెండు అదనంగానే ఖాళీ చేస్తారని సమాచారం).. కూటమి పార్టీలకు ఖచ్చితంగా గవర్నర్ గిరీ దక్కడం ఖాయమని సమాచారం. దీనిలో టీడీపీకి ఒకటి లేదా.. రెండు సీట్లు, జనసేనకు ఒక సీటు దక్కుతుందని అంటున్నారు.

టీడీపీ జాబితాకు వచ్చే సరికి.. యనమల రామకృష్ణుడు ఈ జాబితాలో ముందున్నారు. అయితే.. పార్టీలో ఆయనకు కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు సీట్లు దక్కితే.. అప్పుడు ఇద్దరికీ అవకాశం ఉంటుందని.. ఒకటే కనుక దక్కితే.. పూసపాటికి ఖాయమన్న చర్చ నడుస్తోంది.

ఇక, జనసేనకు ఒక గవర్నర్ పదవి ఖాయమని గట్టిగా వినిపిస్తున్నమాట. బీజేపీ వాయిస్‌ను వినిపిస్తున్న పవన్‌ను మరింత ప్రోత్సహించే క్రమంలో కీలకమైన గవర్నర్ పదవిని అప్పగించడం ద్వారా.. కేంద్రం అడుగులు వేయాలని భావిస్తోంది. ఈక్రమంలో తమిళనాడుకు.. జనసేన నాయకుడిని నియమించే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.