Andhra New: పోతూపోతూ ‘జీపీఎస్‌’ నోటిఫికేషన్‌పై సంతకం

www.mannamweb.com


Andhra New: పోతూపోతూ ‘జీపీఎస్‌’ నోటిఫికేషన్‌పై సంతకం

వైకాపా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌)కు సంబంధించిన దస్త్రంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సంతకం చేశారు.

అమరావతి: వైకాపా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్‌ పథకం (జీపీఎస్‌)కు సంబంధించిన దస్త్రంపై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సంతకం చేశారు. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్‌ దస్త్రాలన్నింటిపైనా సంతకాలు పెట్టారు. వాటిలో జీపీఎస్‌ దస్త్రం కూడా ఉంది. జూన్‌ 12న జీవో 54ను విడుదల చేయగా.. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్‌ను తాజాగా శుక్రవారం గెజిట్‌లో అప్‌లోడ్‌ చేశారు. జీపీఎస్‌ గతేడాది అక్టోబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చి.. గతేడాది అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్‌ అమలుకు ,నాడు విధివిధానాలు రూపొందించకుండా.. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

జీపీఎస్‌ను వ్యతిరేకించిన ఉద్యోగులు
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ పథకం (ఓపీఎస్‌) తీసుకొస్తానని 2019 ఎన్నికల ముందు జగన్‌ పదేపదే వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం పేరుతో సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తెచ్చారు. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యోగుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి, ఏకంగా చట్టం చేసేసింది. ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రహస్యంగా జీపీఎస్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని బయటకు రాకుండా చేశారు. కొత్త ప్రభుత్వంలో పాత జీఓకు అనుగుణంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం, జీపీఎస్‌ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం గమనార్హం.