ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో కానుక అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4 శాతం పెంచిన తర్వాత గ్రాట్యుటీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదవీ విరమణ, మరణాల గ్రాట్యుటీ పరిమితిని 25 శాతం పెంచారు. దీంతో పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త గ్రాట్యుటీ పరిమితి జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఇటీవల కీల నిర్ణయాన్ని ప్రకటించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) రూల్స్, 2021 ప్రకారం పదవీ విరమణ,మరణాల గ్రాట్యుటీకి గరిష్ట పరిమితి ఇప్పుడు రూ. 25 లక్షలుగా ఉంది. వాస్తవానికి ఈ నిర్ణయం ఏప్రిల్ 30న తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం.
గ్రాట్యుటీ అనేది చాలా కాలం పాటు పనిచేసిన ఉద్యోగికి కంపెనీ ఇచ్చే బహుమతి. ఇది జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కి అదనంగా ఇవ్వబడుతుంది. కంపెనీలో కనీసం ఐదేళ్లు పనిచేసినప్పుడే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హత ఉంటుంది. మార్చి 7న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు విడత డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) విడుదలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) కూడా ఆమోదించబడింది. బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 46 శాతం రేటు కంటే ఈ 4 శాతం పెరుగుదల ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ఉద్దేశించి ఈ మేరకు లాభాన్ని ఉద్యోగులకు అందించనున్నారు.
డీఏ పెంపుతో రవాణా భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యూటేషన్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్సులు కూడా 25 శాతం పెరిగాయి. డీఏ, డీఆర్‌ల పెరుగుదల వల్ల ఖజానాపై ఏడాదికి రూ. 12,868.72 కోట్ల ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయంతో దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. గ్రాట్యుటీ, అలవెన్సుల పెంపుదల ఆర్థిక భద్రతను అందించడంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది.