ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. పథకం ఫండింగ్ మొదలుకొని, పని దినాల వరకు, జాబ్ కార్డుల నుంచి ప్లానింగ్ వరకు అన్నీ సమూలంగా మారిపోనున్నాయి. గ్రామీణ ఉపాధి ముఖచిత్రాన్నే మార్చేసే ఈ బిల్లులో ఉన్న కీలక మార్పులేంటి? సామాన్య కూలీకి దీనివల్ల లాభమా? రాష్ట్రాల నెత్తిన పడే భారం ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
125 రోజుల పని.. కానీ మధ్యలో 60 రోజుల ‘బ్రేక్’
కొత్త బిల్లులో అందరినీ ఆకర్షిస్తున్న అంశం పని దినాల పెంపు. సెక్షన్ 5(1) ప్రకారం.. ఇప్పటివరకు ఒక కుటుంబానికి ఏడాదికి గ్యారెంటీగా ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచుతున్నారు. వినడానికి ఇది గుడ్ న్యూస్‌లా ఉన్నా, ఇక్కడే ఒక కీలకమైన మెలిక ఉంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సీజన్‌లో (విత్తనాలు వేసేటప్పుడు, కోతల సమయంలో) కూలీల కొరత రాకూడదనే ఉద్దేశంతో, ఈ పథకాన్ని ఏడాదిలో 60 రోజుల పాటు నిలిపివేస్తారు. ఆయా రాష్ట్రాల వ్యవసాయ క్యాలెండర్, పంటల రకాలను బట్టి ఈ తేదీలను రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. అంటే, ఏడాది పొడవునా కాకుండా, మిగిలిన 10 నెలల్లోనే ఈ 125 రోజుల పనిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ పని డిమాండ్ ఏర్పడే అవకాశముంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
నిజానికి 100 రోజుల పని కల్పిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరు. 2024-25లో సగటున ఒక కుటుంబానికి దక్కింది 50 రోజుల పని మాత్రమే. దాదాపు 8.61 కోట్ల జాబ్ కార్డులు ఉంటే, కేవలం 40.70 లక్షల కుటుంబాలు మాత్రమే 100 రోజుల కోటాను పూర్తి చేశాయి.
రాష్ట్రాలపై భారం.. కేంద్రం వాటాలో కోత
ఇది అత్యంత కీలకమైన, రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చే మార్పు. పాత MGNREGA పద్ధతిలో కూలీల వేతనం మొత్తం (100 శాతం) కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ కొత్త ‘VB-G RAM G’ బిల్లులో ఈ భారాన్ని రాష్ట్రాలు పంచుకోవాలి. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో 90 శాతం నిధులను కేంద్రం భరిస్తే మిగిలిన 10 శాతాన్ని ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేంద్రం 60 శాతం నిధులిస్తే, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు (UTs- అసెంబ్లీ లేనివి) మాత్రం కేంద్రమే మొత్తం నిధులు ఇస్తుంది.
ఆర్ధిక భారం
GST అమల్లోకి వచ్చాక రాష్ట్రాలకు సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గింది. అదే సమయంలో శాలరీలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులు వంటి తప్పనిసరి ఖర్చులు వాటి బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కొత్త నిబంధన వాటికి పెను భారంగా మారనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం చూస్తే, ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రాలపై ఏటా మరో రూ.30,000 కోట్ల భారం పడే అవకాశముంది.
రాష్ట్రాల చేతులు కట్టేసే ప్లాన్?
ఇంతకుముందు రాష్ట్రాలు తమ జిల్లాల్లో ఎంత పని అవసరం ఉందో అంచనా వేసి ‘లేబర్ బడ్జెట్’ను కేంద్రానికి పంపేవి (Bottom-up approach). కానీ ఇకపై ఆ పద్ధతి ఉండదు. అయితే, కొత్త బిల్లు ప్రకారం ఈ విధానం పూర్తిగా మారిపోనుంది. కొత్త బిల్లులోని సెక్షన్ 4(5) ప్రకారం.. కేంద్ర ప్రభుత్వమే కొన్ని పారామీటర్ల ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలనేది ముందే ఫిక్స్ చేస్తుంది. దీనినే ‘నార్మేటివ్ అలకేషన్’ (Normative Allocation) అంటారు.
ప్రమాదం ఇదే
ఒకవేళ కరువు వచ్చినా, లేదా పని డిమాండ్ పెరిగి.. కేంద్రం కేటాయించిన బడ్జెట్ దాటితే, ఆ ఎక్కువ ఖర్చును పూర్తిగా రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. గత ఏడాది అత్యధిక ఉపాధి డిమాండ్ ఉన్న తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.
జాబ్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు
ఈ కొత్త బిల్లులో టెక్నాలజీకి ప్లానింగ్‌కు పెద్దపీట వేశారు. ఇప్పటివరకు ఉన్న జాబ్ కార్డుల స్థానంలో ‘గ్రామీణ్ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డ్’ రాబోతోంది. పాత కార్డుల వాలిడిటీ 5 ఏళ్లు ఉంటే, కొత్త కార్డుల వాలిడిటీని 3 ఏళ్లకు తగ్గించారు. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. సమాజంలో అణగారిన వర్గాల కోసం ప్రత్యేక రంగులో కార్డులు (Special Cards) జారీ చేస్తారు. ఒంటరి మహిళలు, వృద్ధులు (60+), దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ప్రత్యేకంగా హానిగలిగే గిరిజన తెగలు (PVTGs) ఇందులో ఉంటారు.
వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్, పీఎం గతి శక్తి
కొత్త బిల్లు ప్రకారం, పనుల ఎంపిక విధానం కూడా పూర్తిగా మారిపోనుంది. పనులన్నీ ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్’ ద్వారానే మొదలవ్వాలి. ఇవన్నీ కలిసి జాతీయ స్థాయిలో “వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ (Viksit Bharat National Rural Infrastructure Stack)”గా మారుతాయి. ఈ కొత్త విధానంలో, పనులను జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. ముఖ్యంగా నీటి భద్రత కల్పించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, జీవనోపాధికి తోడ్పడే నిర్మాణాలు చేపట్టడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు తీసుకోవడం వంటి నాలుగు కీలక అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ పనులన్నింటినీ పీఎం గతి శక్తి (PM Gati Shakti) ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించి, పక్కా ప్రణాళికతో అమలు చేయనున్నారు.
జరిమానాలు పెంపు
చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాను రూ.1,000 నుంచి ఏకంగా రూ.10,000కు పెంచాలని సెక్షన్ 27లో ప్రతిపాదించారు. బడ్జెట్ అంచనా చూస్తే ప్రస్తుతం ఉన్న రూ.86,000 కోట్ల బడ్జెట్ సరిపోదు. కొత్త స్కీమ్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి ఏడాదికి సుమారు రూ.1,51,282 కోట్లు అవసరమవుతాయని గ్రామీణాభివృద్ధి శాఖ అంచనా వేస్తోంది. ఇందులో కేంద్రం వాటా సుమారు రూ.95,692 కోట్లుగా ఉండొచ్చు.

































