ఇండియా ఐటీ హబ్, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో యువత ఆధునిక జీవనశైలిని అనుసరిస్తున్నారు. కెరీర్, ఎడ్యుకేషన్, ఫ్రీడమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
కానీ ఈ మార్పులు బంధాలను బలహీన పరుస్తున్నాయి. ముఖ్యంగా వివాహ బంధానికి బీటలు వారేలా చేస్తున్నాయి. అవును.. హైదరాబాద్‌లో విడాకుల కల్చర్ పెరిగిపోతుంది. చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీస్తుండగా.. ఇది కాస్త విడాకులకు కారణమవుతుంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి నెలా సుమారు 250 కేసులు నమోదవుతుండగా.. ఇది సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల జంటలే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నట్లు నివేదికలు చెప్తుండగా..హైదరాబాద్ పరిధిలో వివాహమైన ఏడాది కాకముందే 15కి పైగా కేసులు నమోదవుతున్నాయి.
భారతదేశంలో మొత్తం విడాకుల రేటు 1% మాత్రమే ఉన్నప్పటికీ.. ఇది ప్రపంచ రేటు (2%)తో పోలిస్తే తక్కువే అయినా.. యువత మధ్య పెరుగుదల ఆందోళనకరం. గణాంకాల ప్రకారం రెండు దశాబ్దాల్లో విడాకులు రెట్టింపు అయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే
హైదరాబాద్‌లో విడాకుల కేసులు గత ఐదేళ్లలో 25శాతం పెరిగాయి. పురానీ హవేలీ, కూకట్ పల్లి ప్రాంతాల్లోని కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. విడాకులలో దేశంలోని టాప్ ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కాగా రాష్ట్రంలో మొత్తం విడాకుల రేటు 6.7శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే ముఖ్యంగా మెట్రో నగరాల్లో విడాకుల రేటు గత దశాబ్దంలో 30-40% పెరిగింది.
కారణాలేంటి?
* దంపతులు ఒకరితో ఒకరు సమస్యలు పంచుకోవడం తగ్గిపోతుంది. దీంతో అపార్థాలు, మనస్పర్థలు పెరుగుతున్నాయి.
* ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల వల్ల లైఫ్ స్టైల్ మారింది. 67% విడాకులకు ఆర్థిక వివాదాలు కారణంగా ఉండగా.. 42% పురుషులు విడాకుల భరణం చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారు.
* మహిళలు విద్యావంతులు కావడం, ఆర్థికంగా ఇండిపెంట్‌గా ఉండటం వల్ల పెళ్లి, విడాకుల గురించి భయం తగ్గిపోయింది. తాము ఎందుకు తగ్గాలనే మార్పు వచ్చేసింది. సహనం, సర్దుబాటు తగ్గాయి.
* ఫారిన్ కల్చర్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఇందుకు కారణం.
బంధం ఎలా కాపాడుకోవచ్చు?
* న్యాయవేత్తలు, మనస్తత్వవేత్తలు, కౌన్సెలర్ల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టుల్లో ముందుగా ఆఫర్ చేసే కౌన్సెలింగ్ ద్వారా 70శాతం కేసుల్లో విజయవంతం అవుతున్నాయి.
* పెళ్లికి ముందు కూడా కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం.
* చిన్న సమస్యలకు కోర్టు మెట్లెక్కకుండా, మాటల ద్వారా పరిష్కరించుకోవాలి.
* కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందుకోసం సమయం కేటాయించాలి. దంపతులు తమ భావాలను, ఆలోచనలను పంచుకోవాలి.


































