H1B Visa: కీలక అప్‌డేట్

అమెరికా హెచ్1బీ వీసాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై..


మార్చి 24 న ముగియనుంది. అమెరికా ప్రభుత్వం భారీగా ఛార్జీలను పెంచిన నేపథ్యంలో ఈ ఏడాది హెచ్1బీ వీసా దరఖాస్తుదారులను స్పాన్సర్ చేసే యజమానులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అధిక రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారతదేశం నుంచి ఎక్కువగా డిమాండ్ ఉండే హెచ్1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అయితే, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్1బీ వీసా (H1B visa) ఇచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే 10 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ,ఇప్పుడు మాత్రం ఏడాదికి ఏకంగా 125 డాలర్లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

గత ఏడాది జో బైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్ ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరపున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది.

ఈ ప్రక్రియ ప్రతి లబ్ధిదారుడి పాస్‌పోర్ట్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది ఒక ప్రత్యేక గుర్తింపుదారుగా పనిచేస్తుంది. దీంతో ఇది లాటరీ ప్రయత్నాల సంఖ్యను ట్రాక్ చేస్తుంది. ఒకే వ్యక్తికి బహుళ ఎంట్రీలను నిరోధించడానికి ఈ విధానం తీసుకొచ్చారు. ఉత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులను మాత్రమే హెచ్1బీ వీసా ద్వారా అనుమతించేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపు, ఈ విధానం ద్వారా పెద్ద సంఖ్యలో హెచ్1బీ వీసా ద్వారా వచ్చే వలసలను నియంత్రించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.