అద్దంలో మీ ఒత్తైన జుట్టు రోజురోజుకీ పలుచబడిపోవటం చూస్తుంటే మీకు బాధగా ఉందా. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలటం. చిన్న వయసుకే యువతీ, యువకుల్లో జుట్టు రాలటం (hair fall) అధికమవుతోంది.
ఇక జుట్టు రాలటం ఎక్కువయ్యేకొద్దీ మీరు హెయిర్ స్టైల్స్ చేసుకోలేరు. ఇందుకు విరుగుడుగా మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించండి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.
ఇలా చేసి చూడండి..
నూనె మర్ధన చేసుకోవటం, ఉసిరి తినటం, కలబందతో హెయిర్ ప్యాక్ (hair pack) వేసుకోవటం, ప్రతిరోజూ షాంపూ చేయటం, బ్యాలెన్స్డ్ డైట్ వంటివాటిపై ఒకసారి మీరు పూర్తిగా దృష్టిసారించండి. ఆతరువాత మీ జుట్టు ఒత్తుగా పెరిగినట్టు మార్పు కనిపిస్తే మంచిదేగా.
నూనె
చాలామంది తలకు నూనె రాయటానికి ప్రాధాన్యత ఇవ్వరు. మీకు నచ్చిన ఏదో ఒక నూనెను పూయటం చాలా అవసరం. ఇలా చేస్తే బ్లడ్ సర్కులేషన్ పెరిగి, మీ జుట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు గోరువెచ్చని నూనె కూడా మసాజ్ చేసేందుకు ఉపయోగించవచ్చు. ఇలా మసాజ్ చేశాక ఓ వెచ్చని టవల్ తో కొన్ని నిమిషాలపాటు తలకు అలాగే చుట్టుకోండి. దీంతో మీ జుట్టుకు ఎక్స్ ట్రా కండిషనింగ్ వస్తుంది.
ఉసిరి
అన్ని రకాల జుట్టు సమస్యలకు ఉసిరి కాయలు చక్కని విరుగుడు. తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా, పొడవుగా, నిగారింపు సంతరించుకునేలా మీ జుట్టుకు అవసరమైన పోషణ ఇచ్చే ఆమ్లా కుదుళ్లను గట్టిపరుస్తుంది. పరగడపున రోజూ ఉసిరికాయలు తినండి. అదేంటి ఏడాదిపొడవునా ఇవి దొరకవు కదా అనుకోకండి, ఎండబెట్టిన ఉసిరి ముక్కలు, లేదా ఉసిరి మురబ్బా వంటివి మీరు నిల్వచేసుకుని క్రమం తప్పకుండా తినండి. లేదా ఉసిరికాయ ఊరగాయను తినండి. సీ విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యం మరింత పెరుగుతుంది.
కలబంద
కలబందతో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకపోగా మీ కురులకు కలబంద జెల్ అప్లై చేసినప్పుడు అవి పట్టులా మెరిస్తాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు కలబంద చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మీ తలలో తేమను, పోషకాలను పెంచేలా చేసి జుట్టు పెరిగేలా చేస్తుంది. అలోవెరాను రాసి ఓ గంటపాటు వదిలేశాక తలస్నానం చేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
రోజూ తలస్నానం వద్దు
కొందరు తలస్నానం చేయకుండా బయటికి కాలు పెట్టరు. ఇంతకీ తలస్నానం ఎన్నిరోజులకు ఒకసారి చేయాలని చాలామంది అడిగే ప్రశ్నకు ఇదమిత్థంగా ఇది అని సమాధానం లేదు కానీ రోజూ తలస్నానం చేస్తే మీ జుట్టుకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది కూడా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయద్దు. ఇక షాంపుల్లోని రసాయనాల వల్ల కురులకు ప్రమాదం ఎక్కువ. అందుకే రోజూ షాంపుతో తలస్నానం చేయకండి.
బ్యాలెన్స్డ్ డైట్
సమతులమైన ఆహారం (balanced diet) తీసుకోవటం ద్వారా కురుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పోషకాల లేమితో జుట్టు రాలటం ఎక్కువ అవ్వచ్చు. కంటి నిండా నిద్రపోవటం, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ప్రొటీన్లున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఎక్కువ నూనె పదార్థాలు, కొవ్వు అధికంగా ఉన్న ఫ్యాటీ పుడ్స్ ను తగ్గించి, నీరు ఎక్కువగా తాగండి. వీటన్నింటినీ ఆచరించేందుకు ప్రయత్నించండి. అంతేకాదు మీరు జుట్టును దువ్వుకోవటంలో జాగ్రత్త చూపండి. చాలా సాఫ్ట్ గా ఉన్న దువ్వెనతో, సుతిమెత్తగా దువ్వటం అలవాటు చేసుకోండి.