రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తి కావడంతో విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 1994 అక్టోబర్ 2న విజయవాడ-విశాఖపట్నం మధ్య రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ మొదలైంది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటైన రత్నాచల్ విజయవాడ-విశాఖ నగరాల్ని చేరువ చేసింది.
సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండల పేరును రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెట్టారు. ట్రైన్ నెం. 17246/17245గా మొదలైన ఈ రైలు విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఒక ముఖ్యమైన రైలుగా మారింది.
1999లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ సర్వీస్‌గా మార్చారు. దీనిని 2718/2717ఇంటర్ సిటీగా మార్చారు. ప్రయాణ వేగంతో పాటు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. 2006లో ఈ రైలును ఆధునిక CBC రేక్‌లతో అప్‌గ్రేడ్ చేశారు. 24 కోచ్‌ల తో విజయవాడ నుంచి WAM4 ఇంజిన్‌తో నడిపేవారు. తర్వాత దానిని LGD WAP4కి మార్చారు. ప్రస్తుతం అధునాతన LGD WAP7కి మార్చారు. వేగవంతమైన ప్రయాణం, ఖచ్చితమైన సమయపాలనకు గుర్తింపు పొందింది.
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విజయవాడ నుంచి ఒకే సమయంలో విశాఖపట్నం, సికింద్రాబాద్, చెన్నైలకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతాయి. రత్నాచల్ సోదరి రైళ్లు -పినాకిని ఎక్స్‌ప్రెస్ మరియు శాతవాహన ఎక్స్‌ప్రెస్-రోజువారీ ప్రయాణీకులకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. నగరాల మధ్య కనెక్టివిటీలో ఈ రైళ్లు చెక్కుచెదరని విశ్వసనీయత సాధించాయి.
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఆక్యుపెన్సీ 140% పైగా ఉండటమే దీనికి ఉన్న ఆదరణకు అద్దం పడుతుంది. బుధవారం 30వ వార్షికోత్సవం ఈ రైలులో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు ఆనందోత్సహాలతో రైలు ముందు ఫోటోలు దిగారు, విద్యార్ధులు,ఉద్యోగులు, వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు విజయవాడ నుంచి బయల్దేరి తమ పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకునే సదుపాయాన్ని ఈ రైలు కల్పిస్తుంది.