Hardik and Krunal Pandya: పాండ్యా బ్రదర్స్ మోసపోయారు..

www.mannamweb.com


క్రికెట్ లో ఆడటం, ఓడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎల్లవేళలా గెలుస్తూ ఆడలేం, అలాగని ఓడిపోతూ ఉండలేం. కానీ ఇదే ఫార్ములాని బయట బిజినెస్ లో అప్లై చేస్తే తీవ్రంగా నష్టపోతాం. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా సోదరులు ఇద్దరూ కలిసి, వరసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. తీరా సొదరుడు మోసం చేశాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సోదరుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.
వివరాల్లోకి వెళితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా.. ఇద్దరూ క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కృనాల్ బరోడా జట్టులో ఆడుతున్నాడు. ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. వీరిద్దరూ కలిసి వరసకి సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి పాలిమర్ ప్లాస్టిక్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో బ్రదర్స్ ఇద్దరూ 40 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టారు. అంటే ఇద్దరూ 80శాతం పెట్టారు. వైభవ్ పాండ్యా ఏం చేశాడంటే తను 20 శాతం పెట్టాడు.

వ్యాపార నిర్వహణంతా వైభవ్ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. కొన్ని నెలలు బాగానే ఉంది. వచ్చిన లాభాలను ఇదే నిష్పత్తి లో పంచుకున్నారు. అయితే పాండ్యా సోదరులకు తెలియకుండా కొద్దిరోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో బిజినెస్ లో లాభాలను 20 శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడు. అలాగే సంస్థ అకౌంట్ నుంచి డబ్బులను భారీ మొత్తంలో తన ఖాతాకు మళ్లించుకున్నాడు.
అలా మొత్తంగా సుమారు రూ.4.3 కోట్లకు పాండ్యా బ్రదర్స్ కి టోపీ పెట్టాడు. విషయం గురించి బ్రదర్స్ ఇద్దరూ వైభవ్ ని గట్టిగా నిలదీశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పరువు తీస్తానంటూ వైభవ్ బెదిరించినట్టు సమాచారం. దీంతో హార్దిక్, కృనాల్ ఇద్దరూ ముంబాయి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైభవ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ముంబై జట్టులో తలనొప్పులకు తోడు, ఇవి కూడా తోడవడంతో హార్దిక్ పాండ్యా తలపట్టుకున్నాడని అంటున్నారు.