పవన్ కళ్యణ్ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.ఏడాదిగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలిఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు పవన్‌కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్న ఆయన సినిమా షూటింగ్‌కు తాజాగా సమయాన్ని కేటాయించారు. ఈనెల 23న విజయవాడలో ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో పవన్ సహా కీలక నటీనటులు పాల్గొంటారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయనున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఈ ఏడాది చివరికి ప్రేక్షకుల ముందుకురానుంది.
షూటింగ్ కోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో బ్లూమ్యాట్ సెట్‌ను సిద్ధం చేశారు. అందులోనే దర్శకుడు జ్యోతికృష్ణ ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో పవన్ కూడా సెట్‌లో అడుగుపెట్టనున్నారు. దీనికి తగ్గట్లుగానే మరోవైపు నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ డియోల్ , నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్ రావు, సమర్పణ: ఏ.ఎం.రత్నం.
పవన్ కళ్యణ్ ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో “OG” మరియు “హరి హర వీర మల్లు” చాలా తక్కువ షూటింగ్ రోజులు మిగిలి ఉన్నాయి.సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించాలనే కమిట్‌మెంట్‌తో ఆయన ఇటీవల ఓజి, హరి హర వీర మల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలతో సమావేశమయ్యారు.