మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.
బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్‌రావుపై కేసు నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు వాహనంలోకి ఎక్కే ముందు హరీష్ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. బంజారాహిల్స్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు హరీశ్ రావు అరెస్ట్ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటిని పోలీసులు ధ్వంసం చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.