ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా..? వెంటనే ఆ పని చేయకపోతే మీ సొమ్ము గోవిందా

www.mannamweb.com


ఆర్థిక లావాదేవీలను సులువుగా, సౌకర్యంగా నిర్వహించడానికి డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి చాలా వేగంగా డబ్బులు డ్రా చేయవచ్చు.

ఇతర లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కార్డులను ఒక్కోసారి పోగొట్టుకుంటూ ఉంటాం. ఏటీఎంల దగ్గర డబ్బులు డ్రా చేసిన తర్వాత అక్కడే వదిలివేయడమో, ఎవరైనా కార్డులను దొంగలించడమో జరగవచ్చు. ఏది జరిగినా కార్డు పోయిన వెంటనే అప్రమత్తమవ్వాలి. వెంటనే దాని బ్లాక్ చేయాలి. లేకపోతే అనేక నష్టాలు కలుగుతాయి. మీ కార్డును ఉపయోగించి బ్యాంకు ఖాతాలో డబ్బులను కాజేసే అవకాశం ఉంటుంది. లేకపోతే నేర సంబంధ వ్యవహారాలకు కార్డును ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది.

డెబిట్ కార్డు పోతే..!

డెబిట్ కార్డు పోతే బ్యాంకు నుంచి మరో కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ పోయిన కార్డు వల్ల ఆర్థిక నష్టాలు జరగకుండా ఉండాలంటే అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్డును బ్లాక్ చేయాలి. ఎందుకంటే మీ కార్డును దొంగిలించిన వ్యక్తి చాలా తొందరగా మీ ఖాతా నుంచి డబ్బులు కాజేసే అవకాశం ఉంది.
ముందుగా మీ బ్యాంకునకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయాలి. మీ ఖాతా నంబర్, పోయిన కార్డు నంబర్ , ఇతర వివరాలు తెలపాలి. మీ ధ్రువీకరణ కోసం ఇవి అవసరమవుతాయి. బ్యాంక్ సూచనలకు జాగ్రత్తగా వినండి. కార్డును బ్లాక్ చేసే ప్రక్రియను వారు వివరిస్తారు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా డెబిట్ కార్డ్ ను బ్లాక్ చేయవచ్చు. ఇది చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో సర్వీసెస్‌ ఆప్షన్‌ను ఎంచుకుని అనంతరం సూచనలను అనుసరించి మీ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంకులు తమ యాప్ ద్వారా డెబిట్ కార్డులను బ్లాక్ చేయడానికి అనుమతిస్తాయి.
ఎస్ఎంఎస్ ద్వారా కార్డును బ్లాక్ చేయవచ్చు. అనేక బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ ఆధారంగా కార్డ్ బ్లాకింగ్‌ సర్వీసును అందిస్తున్నాయి. దీనికోసం ప్రతి బ్యాంక్ కు ప్రత్యేక నంబర్లు ఉంటాయి. బ్లాక్ అని టైప్ చేసి మీ కార్డులోని చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేసి ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
ఈ ఆప్షన్లు మీరు చేసుకోలేకపోతే వెంటనే మీ బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లండి. అక్కడి ఉద్యోగులకు విషయం చెప్పి, మీ డెబిట్ కార్డును బ్లాక్ చేయాలని చెప్పండి. దానికోసం మీ గుర్తింపు పత్రాలు తీసుకువెళ్లి కార్డను బ్లాక్ చేయించి.. వెంటనే అక్కడే కొత్త కార్డు అప్లయ్ చేసుకునే అవకాశం ఉంటుంది.