ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Pradhan Mantri Awas Yojana)కు దరఖాస్తు చేసుకునే లబ్దిదారులకు శుభవార్త చెప్పింది.
పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని కేంద్రం పొడిగించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు అతి తక్కువ ధరలకు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం AMAY పథకంపై చేసిన తాజా ప్రకటన లక్షలాది నిరుపేదలకు ఉపశమనం కలిగించనుంది. ఎవరైనా ఏ కారణం వల్లనైనా, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే ఈ ఏడాది డిసెంబర్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ యోజన రెండు పథకాలకు దరఖాస్తుల చివరి తేదీని పొడిగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
అధికారిక లెక్కల ప్రకారం, ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 92.61 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. తాజాగా 2025 సంవత్సరానికిగానూ దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. PMAY-U కింద పక్కా ఇల్లు నిర్మించడానికి తక్కువ ఆదాయం ఉన్నవారికి ప్రభుత్వం రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
పీఎం ఆవాస్ యోజనకు అర్హత
- మొదటగా పీఎం ఆవాస్ యోజనకు దరఖాస్తుదారుడు భారతదేశ పౌరుడు కావాలి.
- దరఖాస్తుదారుకు దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. వారి పేరు మీద సొంత ఇల్లు ఉండని వారే అర్హులే
- గ్రామీణ ప్రాంతాల దరఖాస్తుదారుల కుటుంబం నెలవారీ ఆదాయం రూ. 10,000 కంటే తక్కువగా ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారులను సామాజిక, ఆర్థిక సర్వే జన గణన (SEC-2011) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పట్టణ ప్రాంతాల దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం – ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ. 3 లక్షలు, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు రూ. 6 లక్షలు, మధ్యతరగతి ఆదాయం ఉన్న వర్గాలకు రూ. 9 లక్షలు వరకు ఉండాలి.
- ఈ పథకం కింద EWS, LIG సమూహాలకు చెందిన మహిళలు, ముఖ్యంగా వితంతువులు, SC, ST, OBCలతో పాటు అల్పసంఖ్యక సమూహాలకు చెందిన మహిళలు లబ్ధిదారులు అవుతారు.
- ఇందులో రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు, దినసరి కూలీలు, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, వలస కార్మికులు లబ్ధిదారులు అవుతారు.
ఎలా దరఖాస్తు చేయాలి
- మొదటగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ( PMAY) అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- హోం పేజీలో ఉన్న ‘సిటిజన్ అసెస్మెంట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- తరువాత ఆ డ్రాప్డౌన్ మెనులో Your Status (ఉదా – మురికివాడ నివాసులు, 3 భాగాల కింద ప్రయోజనాలు మొదలైనవి) ప్రకారం ఎంపికను ఎంచుకోవాలి.
- వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అందులో మీ పేరు, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి.
- ‘చెక్’ బటన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ను కన్ఫామ్ చేసుకోండి
- మీ రిజిస్ట్రేషన్ ఫారంలో అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా నింపండి
- అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, కాప్చా (Captcha) కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- ఆ తరువాత సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేయండి.
ఏ పత్రాలు అవసరం
- లబ్ధిదారుడి ఆధార్ కార్డు
- మొబైల్ నంబర్
- ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate)
- నివాసం ధృవీకరణ పత్రం (Residence/ Local Certificate)
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- బ్యాంక్ ఖాతా వివరాలు (Bank Passbook Copy)
- రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడీ, లేక పాన్ కార్డు లాంటి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్
































