ప్రమాదాన్ని పసిగట్టే టెక్నాలజీ: పొగమంచులో ADAS ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే

చలికాలంలో కురిసే పొగమంచు భారతీయ రహదారులపై ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రైవర్ల కంటికి కూడా కనిపించని ముప్పును ముందే గుర్తించే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీ ప్రాణాలను ఎలా కాపాడుతుందో ఈ కథనంలో చూడండి.

చలికాలం వచ్చిందంటే చాలు.. రహదారులు మృత్యుపాశాలుగా మారుతుంటాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని మీటర్లకు పడిపోతుంది. ప్రతి ఏటా ఎక్స్‌ప్రెస్‌వేలపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం, ప్రాణనష్టం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ‘ఏడీఏఎస్’ (ADAS) అనే అత్యాధునిక సాంకేతికత వాహనదారులకు ఒక రక్షణ కవచంలా మారుతోంది.


పొగమంచులో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?

మంచు కురిసే సమయంలో డ్రైవర్లకు ఎదురుగా వచ్చే వాహనాల వేగాన్ని, దూరాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది. కారు హెడ్ లైట్లు మంచుపై పడి వెనక్కి ప్రతిబింబించడం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించదు. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే, వెనుక వచ్చే వారు దానిని గమనించేలోపే ఘోర ప్రమాదం జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి చూసే దానికంటే వేగంగా టెక్నాలజీ స్పందిస్తుంది.

అసలు ఈ ‘లెవల్ 2 ADAS’ అంటే ఏమిటి?

వాహనాల్లో ఉండే ఒక స్మార్ట్ భద్రతా వ్యవస్థ Level 2 ADAS. ఇది కారు విండ్‌షీల్డ్ వెనుక ఉండే కెమెరాలు, ముందు గ్రిల్‌లో ఉండే రాడార్ (Radar) సెన్సార్ల సాయంతో పనిచేస్తుంది. కెమెరాలు రోడ్డు మార్కింగ్‌లను, ఇతర వాహనాలను గుర్తిస్తే.. రాడార్ మాత్రం పొగమంచు, వాన లేదా చీకటిలో కూడా ఎదురుగా ఉన్న అడ్డంకులను పసిగట్టగలదు. అందుకే మంచు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం కెమెరా కంటే, రాడార్ తో కూడిన ఏడీఏఎస్ సిస్టమ్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

పొగమంచులో సహాయపడే 4 కీలక ఫీచర్లు:

1. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (Adaptive Cruise Control): పొగమంచులో ముందు వెళ్లే వాహనానికి మన కారుకు మధ్య ఎంత దూరం ఉందో ఊహించడం కష్టం. ఈ ఫీచర్ రాడార్ సాయంతో ముందున్న వాహనం వేగాన్ని బట్టి మన కారు వేగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఒకవేళ ముందు కారు ఆగితే, మన కారు కూడా దానంతట అదే ఆగిపోతుంది. ఇది హైవేలపై వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలను (Rear-end collisions) తగ్గిస్తుంది.

2. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB): విజిబిలిటీ 10 మీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది ప్రాణదాతగా నిలుస్తుంది. డ్రైవర్ గమనించకపోయినా, ఎదురుగా ఏదైనా వాహనం లేదా అడ్డంకి ఉన్నట్లు సిస్టమ్ గుర్తిస్తే.. క్షణాల్లో ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది.

3. కొలిషన్ వార్నింగ్ సిస్టమ్ (Collision Warning): మనం వేగంగా వెళ్లి వేరే వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ శబ్దాల ద్వారా, లైట్ల ద్వారా డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీనివల్ల డ్రైవర్ వెంటనే అప్రమత్తమై స్టీరింగ్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది.

4. లేన్ సెంటరింగ్ అసిస్ట్ (Lane Centering Assist): పొగమంచులో కారు రోడ్డు మీద ఏ లేన్‌లో వెళ్తుందో తెలియక పక్కకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. రోడ్డుపై మార్కింగ్స్ స్పష్టంగా ఉంటే, ఈ టెక్నాలజీ కారును సరైన లేన్‌లోనే ఉంచుతుంది.

రాడార్ + కెమెరా: సరైన జోడి

కేవలం కెమెరాల మీద ఆధారపడే సిస్టమ్స్ పొగమంచులో విఫలం కావచ్చు. కానీ రాడార్ తో కూడిన సిస్టమ్స్‌కు మంచు అడ్డంకి కాదు. ప్రస్తుతం భారత్ లో హ్యుందాయ్, హోండా, మహీంద్రా, టాటా, ఎంజీ వంటి కంపెనీలు తమ కార్లలో ఈ అధునాతన రాడార్ ఆధారిత ఏడీఏఎస్ ఫీచర్లను అందిస్తున్నాయి.

ఎంత టెక్నాలజీ ఉన్నా.. జాగ్రత్త తప్పనిసరి!

ఏడీఏఎస్ అనేది మనకు సహాయం చేయడానికి మాత్రమే, అది డ్రైవర్‌కు ప్రత్యామ్నాయం కాదు. అందుకే పొగమంచులో ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం:

  1. వేగాన్ని బాగా తగ్గించి ప్రయాణించండి.
  2. ఫాగ్ ల్యాంప్స్ వాడండి, కానీ హై-బీమ్ లైట్లను నివారించండి.
  3. ముందు వాహనానికి సాధారణం కంటే ఎక్కువ దూరం పాటించండి.
  4. అకస్మాత్తుగా లేన్లు మారడం లేదా హఠాత్తుగా బ్రేకులు వేయడం చేయకండి.

టెక్నాలజీ సాయంతో పాటు మన బాధ్యతాయుతమైన డ్రైవింగ్ తోడైతే, ఈ చలికాలం ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.