అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. తమ వద్ద లోన్లు తీసుకున్న వారికి అదనపు భారాన్ని మోపుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటిచింది. సాధారణంగా బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. దీనిని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్‌ఆర్) అని అంటారు. ఈ రేటును పది బేసిస్ పాయింట్లను జూలై ఎనిమిదో తేదీ నుంచి పెంచుతున్నట్లు బ్యంకు ప్రకటించింది. ఈమేరకు తన అధికారిక వెబ్‌సైట్లో హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ఈ తాజా పెంపుతో ఎంసీఎల్‌ఆర్ రేటు 9.05శాతం నుంచి 9.40శాతం మధ్య ఉంటుంది. ఫలితంగా కొన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ సహా అన్ని ఫ్లోటింగ్ రేటు కలిగిన లోన్లపై వడ్డీ రేటు పెరగనుంది. అంటే ఈఎంఐ భారం ఎక్కువవుతుంది. ఇప్పటికే తీసుకున్న వారందరిపైనా ఇది ప్రభావం చూపుతుంది. వారందరూ ఇకపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా రేట్లు ఇవి..
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఓవర్ నైట్ టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచి8.95 నుంచి 9.05శాతానికి చేర్చింది.
- నెల రోజుల ఎంసీఎల్‌ఆర్ రేటు 9శాతం నుంచి 9.10శాతానికి పెంచింది.
- మూడు నెలల కాల వ్యవధి గల ఎంసీఎల్‌ఆర్ రేటు 9.15శాతం నుంచి 9.20శాతానికి పెరిగింది.
- ఆరు నెలల కాల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్ రేటు 9.30శాతం నుంచి 9.40శాతానికి చేరింది.
- రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్‌రేటు 9.40శాతంగా ఉంది.
అసలు ఎంసీఎల్‌ఆర్ అంటే..
ఎంసీఎల్‌ఆర్ పూర్తి పేరు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. అంటే బ్యాకులు వివిధ లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ. దీనిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటారు. అన్ని బ్యాంకుల్లో ఇదే పద్ధతిని అమలు చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలున్నాయి. వినియోగదారులు తీసుకునే లోన్ల వడ్డీలు ఏడాది వ్యవధితో ఉండే ఎంసీఎల్‌ఆర్ రేటు ఆధారంగా ఉంటాయి. ఏడాది ఎంసీఎల్‌ఆర్ పెరిగితే లోన్ తీసుకున్న కస్టమర్లు ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. లేదా లోన్ టెన్యూర్ పెరిగిపోతుంది. ఇది వినియోగదారుడిపై అదనపు భారాన్ని మోపుతుంది. ఇప్పడు హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఈ ఎంసీఎల్‌ఆర్ పది బేసిస్ పాయింట్లను పెంచడంతో ఇప్పటికే లోన్లు తీసుకున్న వినియోగదారులు ఈ అదనపు భారాన్ని భరించాల్సిందే. అది కూడా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్లు తీసుకున్న వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.