జీవితంలో ప్రయోగాలు చేయాలి.. లేకపోతే బోరింగ్ గా ఉంటుంది. అన్నింటికీ మించి చేరుకోవాల్సిన లక్ష్యాలను చేరుకోలేకపోయామనే బాధ జీవితాంతం ఉంటుంది.
అయితే జీవితం మీద ప్రయోగాలు చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. మెజారిటీ శాతం చదువు, ఉద్యోగం, ఇల్లు, ఆస్తులు, అందమైన కుటుంబం ఉంటే చాలనుకుంటారు. కానీ ఈయన అలా కాదు.. ఏటికి ఎదురీదే రకం. సమస్య తుది అంచుదాక వెళ్లే రకం. తనమీద తనే ప్రయోగాలు చేసుకునే రకం. అందువల్లే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఏకంగా 44 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.
అమెరికా.. అందులోనూ ఆరిజోనా రాష్ట్రం.. ఇంటెల్ కంపెనీలో ఉద్యోగం.. విదేశాలను చుట్టివచ్చే అవకాశం.. ప్రతినెల కోరుకున్నంత జీతం.. అందమైన కుటుంబం.. ఇవన్నీ అతడికి సంతృప్తి అనిపించలేదు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. దండిగా సంపాదిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక వెలితి.. జీవితాన్ని కోల్పోతున్నాననే బాధ. ఆ బాధలో నుంచి ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన అతడిని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేలా చేసింది. ఇండియాలో రాగానే అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించలేదు. వ్యాపారం చేద్దామని పెట్టుబడి పడితే తిరిగి రాలేదు. కష్టాలు ఎదురయ్యాయి. కన్నీళ్లు పలకరించాయి. బాధలు స్వాగతం పలికాయి. అయినప్పటికీ వాటిని అతడు అత్యంత సాహసంతో స్వీకరించాడు. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు.
హైదరాబాద్ నగర వాసులకు సిద్ ఫార్మ్ మిల్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇవి కేవలం ఆవు పాలు.. ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ.. నేటి కాలంలో ఆరోగ్యం కోసం ఈమాత్రం ఖర్చు చేయకపోతే కష్టం. సిద్ ఫార్మ్ మిల్క్ సృష్టికర్త పేరు కిషోర్. ఈయన 2000 సంవత్సరంలోనే అమెరికా వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ఐఐటీలో ఎంఎస్ చేసి అత్యున్నత ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఇక్కడ ఇంటెల్ కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టారు. ఉద్యోగంలో భాగంగా అనేక దేశాలు తిరిగారు. అయితే అవన్నీ కూడా ఆయనకు సంతృప్తి అనిపించలేదు. నీతో 2012లో ఇండియాకు తిరిగివచ్చారు.. హైదరాబాదులో వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. అది అంతగా లాభాలను ఇవ్వలేదు. ఆ తర్వాత కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డెయిరీ ఫార్మ్ ఏర్పాటు చేశారు. మొదట్లో నష్టాలు వచ్చాయి. దీంతో వెనక్కి వెళ్ళిపోదామని కుటుంబ సభ్యులు అంటే వారించారు. ఆ తర్వాత 20 ఆవులను కొనుగోలు చేశారు.. ఆవులతో సిద్ ఫార్మ్ ఏర్పాటు చేశారు. తన కొడుకు పేరు మీద తన వ్యవసాయ క్షేత్రం నుంచి ఉత్పత్తి బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి రసాయనాలు లేకుండా వినియోగదారులకు పాలను అందించడం మొదలుపెట్టారు. దీంతో ఒకసారిగా ఆయన బ్రాండ్ వాల్యూ పెరిగింది. పాలకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు కిషోర్ సిద్ ఫార్మ్ మిల్క్ కంపెనీ వాల్యూ ఏకంగా 44 కోట్లకు చేరుకుంది. ఒకప్పుడు పదికిమించి లీటర్ల పాల ఉత్పత్తి వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సంఖ్య పదివేల లీటర్లకు చేరుకుంది. . ఈ పాలు మొత్తం కూడా ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆవుల నుంచి తీస్తున్నవే అంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఆయనకు పదివేల మంది వరకు కస్టమర్లు ఉన్నారు.. ఇక ఈయన కంపెనీలో మొత్తంగా 50+ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈయనకు ఉద్యోగులు ఉన్నారు. మీరు మాత్రమే కాకుండా 150 విక్రయ కేంద్రాలు ఈయన సంస్థకు ఉన్నాయి. ఎక్కడో అమెరికాలో ఉంటే మహా అయితే విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. కానీ తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునేవారు కాదు. అందువల్లే జీవితం మీద ప్రయోగాలు చేయాలి. ఇబ్బందులు పడాలి. ఆ తర్వాత ఇదిగో ఇలా ఎదగాలి. ఇలా ఎదిగినప్పుడే మనకంటూ ఒక బ్రాండ్ ఉంటుంది. మనకంటూ ఒక వైబ్ ఉంటుంది. దానిని వర్ణించడం కష్టం.. జస్ట్ అనుభవించాలంతే.
































