టీమిండియా లక్కీ ఛార్మ్ అతనే.. ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో విజయమే

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టుకు లక్మీ ఛార్మ్‌గా మారాడు. టీ20 క్రికెట్‌లో అతను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తోంది. 2019 నుంచి అతను 32 అంతర్జాతీయ టీ20లు ఆడగా..


ఈ 32 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. ప్రస్తుతం ఈ రికార్డ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

2019లో బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన శివమ్ దూబే ఇప్పటి వరకు 37 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో చివరగా ఆడిన 32 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. గత రెండేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్న శివమ్ దూబే.. భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

ఆసియా కప్ 2025లో ఎక్స్‌ట్రా పేస్ ఆల్‌రౌండర్‌గా అవకాశం అందుకున్న శివమ్ దూబే.. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో(3/4) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేయని శివమ్ దూబే.. బ్యాటింగ్‌లో 10 పరుగులతో అజేయంగా నిలిచి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ టోర్నీ మొత్తం శివమ్ దూబేను జట్టులో కొనసాగించనున్నారు. అతని కోసం స్పెషలిస్ట్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టారు. శివమ్ దూబే కారణంగా బ్యాటింగ్ డెప్త్‌తో పాటు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అంతేకాకుండా అతను ఆడిన మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓటమే లేకపోవడం కూడా ఓ సెంటిమెంట్‌గా మారింది.

ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 4 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం ఒమన్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుత ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్టే లేకుండా పోయింది. దాంతో టోర్నీ చప్పగా సాగుతోంది. కనీసం సూపర్ -4లోనైనా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరోవైపు భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్‌ సూపర్ -4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బుధవారం యూఏఈతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టోర్నీలో ముందడుగు వేయనుంది. ఒకవేళ పాకిస్థాన్ సూపర్-4 చేరితే ఆదివారం భారత్‌తో మరోసారి తలపడనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.