8 మంది టీచర్లను పెళ్లాడాడు.. లోన్ డబ్బు రూ. కోట్లతో జంప్..

ఎవరైనా బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పెళ్లి చేసుకుని డబ్బు సంపాదించాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మందిని వివాహం చేసుకున్నాడు.


వీరంతా ప్రభుత్వ టీచర్లే కావడం గమనార్హం. వాళ్లు లోన్లు తీసుకునేలా ప్రేరేపించేవాడు. అలా 8 మంది భార్యల నుంచి వచ్చిన రూ. కోట్ల డబ్బుతో జంప్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్రా జిల్లాలో జరిగింది. ఈ నిత్య పెళ్లికొడుకు కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్రా జిల్లాకు చెందిన రాజన్ గహ్లోత్ పెద్ద ప్లాన్ వేశాడు. ఒకరికి తెలవకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అలా 8 మంది ప్రభుత్వ టీచర్లను వివాహం చేసుకున్నాడు. వారిని లోన్ తీసుకోవాలని ప్రేరేపించాడు. అలా వచ్చిన డబ్బుతో పరారయ్యాడు. సోన్ భద్రా జిల్లాకు చెందిన ఇద్దరు టీచర్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. తమతో పాటు మరో ఆరుగురు మహిళలనూ ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని.. వాళ్లంతా ప్రభుత్వ టీచర్లేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

షాదీ. కమ్ ద్వారా పరిచయం..

2014 లో షాదీ. కమ్ అనే వివాహ పోర్టల్ ద్వారా తనకు గహ్లోత్ పరిచయం అయ్యాడని ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు చెప్పారు. ‘గహ్లోత్ తాను ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పి నాతో స్నేహంచేశాడు.నేను అతడ్ని నమ్మాను ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 2016లో ఇళ్లు కొందామని రూ.40 లక్షల బ్యాంకు రుణం తీసుకోవాలని నన్ను ఒత్తిడి చేశాడు. లోన్ డబ్బులు రాగానే పరారయ్యాడు’ అని ఆ ఉపాధ్యాయురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో మహిళ ఇచ్చిన ఫిర్యాదులో.. గహ్లోత్ 2019లో తనను కలిశాడని తాను ఎక్సైజ్ శాఖ అధికారిగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు.ఇద్దరం వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. 2022లో ఇల్లు కట్టుకోవడానికి రూ.42 లక్షలు లోన్ తీసుకునేటట్లు చేశాడని ఆ డబ్బుతో పరారయ్యాడని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.