బెల్లం ఒక సహజ స్వీటెనర్. బెల్లంలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2, ఈ.., లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. శీతాకాలం మన డైట్లో బెల్లం చేర్చుకుంటే.. శరీరంలో వేడిని పుట్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో.. బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నారు. నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆయుర్వేదం ప్రకారం, వేడినీటిలో బెల్లం కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలోని పోషకాలు జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తాయి. బెల్లంలో.. ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి. శరీరాన్ని రిలాక్స్ చేసి.. మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీరు తీసుకోవటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. బెల్లంలోని మెగ్నీషియం, విటమిన్లు B1, B6, సీ తోపాటుగా ఇతర యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మన శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడుతుంది.
బెల్లం నీరు శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, ఆహార పైపులు, కడుపు, పేగులను కూడా శుభ్రపరుస్తుంది. ఇది న్యాచురల్ డైజెస్టివ్ ఎంజైమ్‌లను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ వేగంగా జరిగేలా చేస్తంది. కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.
బెల్లం నీరు శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్, మినరల్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఇకపోతే, బెల్లం నీరు తయారీ కోసం కావాల్సినంత బెల్లం, చియా సీడ్స్, నిమ్మకాయ, పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా మీకు సరిపడా నీళ్లు తీసుకుని అందులో బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడా నీటిలో నిమ్మరసం, చియా సీడ్స్, పుదీనా ఆకులు వేసుకుని కాస్త గోరు వెచ్చగా తాగితే సరిపోతుంది.