నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.
ఆంధ్రపదేశ్ లో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఏపీకి భారీ వర్షసూచన చేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతరామరాజు, ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తెలంగాణాకు భారీ వర్ష సూచన
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుండి ఎక్కువ స్థాయిలో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ చెప్పింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్‌కు వర్ష సూచన
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని , హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాత్రి సమయాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.