ఏపీలోని ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు కుమ్మేయనున్న భారీ వర్షాలు

www.mannamweb.com


AP Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది.

ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసింది.

మొన్నటి వరకూ ఎండతో విలవిల్లాడిన ఏపీ ప్రజలకు ఈ వర్షాలు ఊరట కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. ఈ రెండు జిల్లాల్లో ఎండిపోయిన చెరువులు, కుంటలు ఇప్పుడిప్పుడే జలకళను సైతం సంతరంచుకుంటోన్నాయి.

ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. వచ్చే మూడు రోజుల పాటు అంటే ఈ నెల 14వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు కురిపే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థలు తెలియజేశాయి.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కర్నూలు, అనంతపురం, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయి. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అన్నారు.