పోలీసులతో ఆడుకున్న ‘హలో బ్రదర్స్‌’.. చిన్న తప్పుతో దొరికిపోయారు!

Twin brothers | ఇంటర్నెట్‌ డెస్క్‌: వారిద్దరూ అన్నదమ్ములు. నిమిషాల వ్యవధిలో జన్మించిన హలో బ్రదర్స్‌. దొంగతనాలు చేయడం వీరి స్పెషాలిటీ. ఒకరు ఇల్లు గుల్ల చేస్తే..


ఇంకొకడు వేరే ప్రదేశంలో చక్కర్లు కొడతాడు. ఎప్పుడైనా పోలీసులకు చిక్కినా.. ఇది సీసీటీవీ ఫుటేజీ అంటూ తప్పించుకుంటారు. కొన్నేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు. ఆ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా కథను పోలిన ఈ దొంగ బ్రదర్స్‌ కథకు తాజాగా ఎండ్‌ కార్డ్‌ పడింది. అదెలాగంటే?

మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌ వర్మ, సంజీవ్‌ వర్మ దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. ఒకరు దొంగతనాలు చేస్తే.. ఇంకొకరు సీసీటీవీ ఫుటేజీ సంపాదించి బయటపడుతుంటారు. అసలు వీరిద్దరూ అన్నదమ్ములు అన్న సంగతి ఆ గ్రామస్థులకు మినహా బయటి వ్యక్తులకు పెద్దగా తెలీదు. ఎవరూ గుర్తు పట్టకూడదన్న ఉద్దేశంతో ఇద్దరూ కలిసుండడం కూడా అరుదే. ఒకేలాంటి దుస్తులు ధరించడం, ఒకేలాంటి ఆహర్యంతో ఇన్నాళ్లు మేనేజ్‌ చేస్తూ వస్తున్నారు. ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నా.. పోలీసులకు మస్కా కొడుతూ జల్సాలు చేస్తున్నారు. ఇందులో సౌరభ్‌ కుమార్‌ దొంగతనాలు చేయడంలో దిట్టైతే.. సంజీవ్‌ తప్పుదోవ పట్టించడంలో ఆరితేరాడు.

‘క్యాబ్ డ్రైవర్‌కే డ్రైవర్‌గా ..’ స్టార్టప్‌ ఓనర్‌కు వింత అనుభవం..!
అయితే, ఈ ఏడాది డిసెంబర్‌ 23న మౌగంజ్‌ సిటీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఆ ఇంట్లోని నగలు, లక్షల్లో డబ్బు దోచుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పట్టుకొన్నారు. అందులో సౌరభ్‌ వర్మ ఉన్నాడు. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంది. సౌరభ్‌ కోసం సంజీవ్‌ రావడంతో చూసి పోలీసులే కంగుతిన్నారు. లోపల ఉన్నవాడు బయటకు ఎలా వచ్చాడో తెలీక ఆశ్చర్యపోయారు. దీంతో తనదైన శైలిలో విచారించగా.. కవల సోదరుల అసలు బండారం బయటపడింది. వారి నుంచి లక్షలాది రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.