హనుమకొండలో విషాదం.. విద్యార్థి మృతితో హైటెన్షన్..

 హనుమకొండ (Hanumakonda)లో చిన్నారి మృతి సంచలనంగా మారింది. నయీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.


ఈ పాఠశాలలో సురజిత్ ప్రేమ్ అనే విద్యార్థి (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. విద్యార్థిని ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర తలనొప్పి కారణంతో విద్యార్థిని ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు.

విద్యార్థి సురజిత్ ప్రేమ్ మృతితో స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటన బయటకు రావడంతో పాఠశాల గేటుకు తాళం వేసి యాజమాన్యం పరారైంది. విద్యార్థి సురజిత్ ప్రేమ్‌ది హనుమకొండ గుండ్లసింగారం. కాగా, సెప్టెంబర్‌లో ఇదే పాఠశాలలో పదో తరగతి చదవుతున్న మరో విద్యార్థి జయంత్ వర్థన్ మృతిచెందాడు. ఈ క్రమంలో పాఠశాల దగ్గరకు చనిపోయిన జయంత్ వర్థన్ తల్లిదండ్రులు చేరుకుని ఆందోళన చేపట్టారు.

తమ చిన్నారులని ఈ పాఠశాల యాజమాన్యం దారుణంగా పొట్టన పెట్టుకుందని మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో స్కూల్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలపై దాడికి బంధువులు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా స్కూలు వద్ద మోహరించారు. దాడి చేయకుండా కుటుంబసభ్యులని అడ్డుకున్నారు.

దీంతో కుటుంబసభ్యులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం హనుమకొండ ఏసీపీ నర్సింగరావుకి తెలియడంతో వెంటనే పాఠశాల దగ్గరికి చేరుకున్నారు. బంధువులతో ఏసీపీ నర్సింగరావు మాట్లాడుతున్నారు. ఆందోళన విరమించాలని ఏసీపీ నర్సింగరావు కోరారు. ఈ క్రమంలో స్కూల్ దగ్గర ఉన్న వారిని పక్కకు పంపిస్తున్నారు పోలీసులు. విద్యార్థులు బంధువులతో మాట్లాడి సర్థి చెప్పేందుకు ఏసీపీ ప్రయత్నించారు. విద్యార్థుల కుటుంబాలకి న్యాయం చేస్తామని ఏసీపీ నర్సింగరావు హామీ ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.