ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు మరోసారి సెలవులు పొడిగించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం తగ్గిన తరువాత వాతావరణ పరిస్థితులను సమీక్షించి, తరగతుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు.. ‘మొంథా’ తుఫాను క్రమంగా బలపడుతోంది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ప్రకటన ప్రకారం.. తుఫాను ప్రభావంతో నేడు రాష్ట్రంలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
































