ఒకప్పుడు తన పాప్ సంగీతంతో ప్రపంచాన్ని ఊర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ ఇప్పుడు లేడు. కానీ అతనే స్వయంగా పాడుతున్న సంగీత కచేరీలు ఇప్పటికీ ప్రజలను అలరిస్తున్నాయి!
అదెలా అంటారా? హోలోగ్రామ్ టెక్నాలజీ మాయ. అతను బతికి లేనప్పటికీ అచ్ఛం అతనిలా కనిపించే ఒక రూపం లేదా ప్రతిబింబం పాడటం, డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. అంటే ఈ అధునాతన సాంకేతికత ఒక వ్యక్తికి సంబంధించిన త్రీ- డైమెన్షనల్ (3D) ఇమేజ్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది అంటున్నారు నిపుణులు.
లేజర్ కాంతితో త్రీడీ చిత్రాలు
వాస్తవానికి హోలోగ్రామ్(Holograms) అనేది ఒక ఫొటోగ్రాఫిక్ టెక్నిక్. ఇది లేజర్ కాంతిని ఉపయోగించి మనం కోరుకున్న వస్తువు లేదా వ్యక్తికి సంబంధించిన 3D చిత్రాలను సృష్టించవచ్చు. దీనివల్ల వాటి నిజమైన ప్రతిబింబం కళ్లముందు ఉన్నట్లే అనిపిస్తుంది. అంటే హోలోగ్రామ్‌లు కాంతి విక్షేపణ (diffraction) ద్వారా పనిచేస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు నుంచి ప్రతిబింబించే నమూనాలను రికార్డ్ చేసి తిరిగి ప్రదర్శిస్తాయి. దీంతో వ్యక్తుల హోలోగ్రామ్‌లను క్రియేట్ చేసినప్పుడు అచ్చం వారు కళ్లముందు ఉన్న ఫీల్ కలుగుతుంది. దీనికి ఏఐ తోడు కావడంతో మరింత ఎఫెక్టివ్‌గా మారుతూ అందరినీ అలరిస్తున్నది.
వర్చువల్ పాత్రల సృష్టి
హోలోగ్రామ్ టెక్నాలజీతో వర్చువల్ పాత్రలు ఫిక్షనల్ వ్యక్తులను కూడా సృష్టించవచ్చు. జపాన్‌కు చెందిన 38 ఏండ్ల అకిహికో కొండో అనే వ్యక్తి, హోలోగ్రామ్ అండ్ ఏఐ సాంకేతికతతో రూపొందించబడిని హాట్సునే మికు అనే వర్చువల్ పాప్ ఐడల్‌ను ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో హోలోగ్రామ్ సాంకేతికత గురించి సోషల్ మీడియాలో పలువురు చర్చిస్తున్నారు. దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఫిక్టో సెక్సువాలిటీకి దారి..
సోషల్ మీడియా కథనాల ప్రకారం జపాన్‌లో 4,000 మందికి పైగా ఇలాంటి అనధికారిక ‘టెక్ వివాహాలు’ చేసుకున్నట్లు సమాచారం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది జపాన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫిక్టో సెక్సువాలిటీ(phyctosexuality) అనే కొత్త మూవ్ మెంట్‌కు దారితీస్తోంది. అంటే ఇందులో వ్యక్తులు వర్చువల్ జీవులతో భావోద్వేగ సంబంధాలు ఏర్పర్చుకుంటారు. ఒక విధంగా డిజిటల్ సాన్నిహిత్యం(Digital intimacy) తదుపరి దశగా నిపుణులు పేర్కొంటున్నారు.
ముందుగా ఎవరు డెవలప్ చేశారు?
హోలోగ్రఫీని మొదట 1947లో హంగేరియన్ భౌతిక శాస్త్రవేత్త డెన్నిస్ గాబోర్(Dennis Gabor) కనుగొన్నారు. అతను ఈ ఆవిష్కరణకు గాను 1971లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయితే లేజర్‌లు అభివృద్ధి చెందిన తర్వాత 1960లలో హోలోగ్రఫీ సాంకేతికత మరింత పురోగమించింది, ఎందుకంటే లేజర్ కాంతి హోలోగ్రామ్‌ల సృష్టికి అవసరమైన స్థిరమైన కాంతి మూలాన్ని అందిస్తుంది.
హోలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగాలు
*ఎంటర్టైన్మెంట్ : సంగీత కచేరీలు, వర్చువల్ పాత్రలతో సినిమాలు, గేమింగ్‌లో గేమింగ్‌లో 3D అనుభవాలు లేదా అనుభూతి కోసం హోలోగ్రామ్‌లు ఉపయోగించబడతాయి.
*వైద్య రంగం : మెడికల్ ఇమేజింగ్‌లో శరీర అవయవాల 3D మోడల్‌లను సృష్టించడానికి, శస్త్రచికిత్సలకు ప్లానింగ్‌కు ఉపయోగిస్తారు.
*భద్రత : క్రెడిట్ కార్డులు, గుర్తింపు కార్డులు, కరెన్సీ నోట్లలో నకిలీని నివారించడానికి హోలోగ్రామ్‌లు వాడతారు.
*ఎడ్యేకేషన్ : 3D హోలోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులకు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనల(Complex scientific concepts)ను వివరించడం సులభమవుతుంది.
*కమ్యూనికేషన్: హోలోగ్రాఫిక్ వీడియో కాల్స్ లేదా వర్చువల్ మీటింగ్‌లు భవిష్యత్తులో సాధారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు.
*పరిశ్రమలు: డిజైన్, అండ్ ఇంజినీరింగ్‌లో, ప్రొడక్ట్స్‌కు సంబంధించిన 3D ప్రోటోటైప్‌లను సృష్టించడానికి ఉపయోగిస్తారు.
హోలోగ్రామ్ టెక్నాలజీతో నష్టాలు
* హోలోగ్రామ్ సాంకేతికతను అభివృద్ధి చేయడం, అమలు చేయడం ఖర్చుతో కూడుకున్నది. పైగా అధునాతన లేజర్‌లు, ఆప్టికల్ సామగ్రి, నైపుణ్యం అవసరం.
*వర్చువల్ జీవులతో (ఉదా., హాట్సునే మికు) అతిగా భావోద్వేగ సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ‘ఫిక్టోసెక్సువాలిటీ’ వంటి ధోరణులు పెరిగి, రియల్ లైఫ్ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.
* హోలోగ్రాఫిక్ డివైస్‌లు డేటాను సేకరించి, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
*హోలోగ్రామ్‌లపై అధిక ఆధారపడటం వల్ల నిజ జీవిత అనుభవాల నుండి దూరమవ్వచ్చు. ఇది సామాజిక ఒంటరితనాని(social isolation)కి దారితీయవచ్చు. హోలోగ్రామ్ టెక్నాలజీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తున్నప్పటికీ దాని ఉపయోగంలో జాగ్రత్తలు తీసుకోవడం, నష్టాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం అంటున్నారు సాంకేతిక నిపుణులు.
































