Rushikonda: ఒక్కో కమోడ్‌ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!

www.mannamweb.com


విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు!

అమరావతి: విశాఖలోని రుషికొండపై జగన్‌ కట్టుకున్న ప్యాలెస్‌లో అమర్చిన టాయ్‌లెట్‌ కమోడ్‌కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి నిర్మించిన విలాసవంతమైన భవనాల్లో అత్యంత ఖరీదైన టోటో బ్రాండ్‌ కమోడ్‌లు అమర్చారు.

వాటి ధర మోడల్‌ను బట్టి రూ.9 లక్షల నుంచి రూ. 15.95 లక్షల వరకు ఉంది. రుషికొండ ప్యాలెస్‌లలో అత్యంత ఖరీదైన మోడల్‌ టాయిలెట్‌లనే అమర్చారు. వాటి ధర తక్కువలో తక్కువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా..! రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి వెచ్చించిన మొత్తం రూ.1.80 లక్షలు. అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అంటే రుషికొండ ప్యాలెస్‌లలో అమర్చిన ఒక్కో కమోడ్‌ ధరతో పేదలకు కనీసం ఆరు ఇళ్లు కట్టొచ్చన్న మాట!

ఇక్కడి ఒక్కో స్నానపు గదిని 480 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో కట్టుకునే ఇల్లు విస్తీర్ణం 340 చదరపు అడుగులు మాత్రమే. ఈ ప్యాలెస్‌లలో అమర్చిన టాయిలెట్‌ కమోడ్‌లకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. చలికాలంలో టాయిలెట్‌ షీట్‌ని వేడిగా ఉంచుకునే వెసులుబాటు, ఆటోమేటిక్‌ ఎయిర్‌ ఫ్యూరిఫైయింగ్‌ సిస్టమ్‌ వంటివి దీని ప్రత్యేకతలు. కమోడ్‌ మూత తెరుచుకోవడం, మూతపడటం, ఫ్లష్‌ చేయడం వంటివి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.

జగన్‌ ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు స్థలంలో కట్టే ఇల్లు కంటే.. విశాలంగా కట్టుకున్న స్నానపు గదుల ఫొటోలు, వీడియోలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు! వాటిలో అమర్చిన వస్తువుల ధరలు గురించి తెలిసేకొద్దీ సామాన్యుల కళ్లు మరింత బైర్లు కమ్ముతున్నాయి.