కళ్లద్దాల్ని ఎలా శుభ్రం చేస్తున్నారు?

కళ్లద్దాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి బ్యూటీ కిట్‌లో భాగమయ్యాయి. సైట్‌ ఉందని కొందరు.. స్టైల్‌, ఫ్యాషన్‌ కోసం మరికొందరు వీటిని వాడుతున్నారు. కంప్యూటర్‌ స్క్రీన్‌ వెలుతురు ప్రభావం తమ కంటిపై పడకుండా ఇంకొందరు కళ్లకు అద్దాలు పెట్టుకుంటున్నారు. అయితే వాడకం సంగతి సరే కానీ.. వీటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. చేతికి ఏది అందుబాటులో ఉంటే దాంతో వీటిని క్లీన్‌ చేస్తుంటారు. అయితే దీనివల్ల లెన్సుల నాణ్యత దెబ్బతిని.. కంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే కళ్లద్దాల్ని శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..


అవసరం ఎలాంటిదైనా కళ్లద్దాల్ని వాడే వారు వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం అంత జాగ్రత్తగా ఉండరు. చేతికి అందుబాటులో ఉన్న క్లాత్స్‌, వేసుకున్న దుస్తులు, స్కార్ఫ్‌, కర్చీఫ్‌.. వంటి వాటితో లెన్సులు తుడుస్తుంటారు. నిజానికి దీనివల్ల లెన్సులపై మన కంటికి కనిపించని సన్నటి గీతలు పడే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్‌ క్రమంగా మన కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

ఇవి గుర్తుంచుకోండి!

కళ్లద్దాల లెన్సులు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే వాటిని శుభ్రం చేసే క్రమంలో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ కళ్లద్దాల లెన్సుల్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో ప్రత్యేకమైన క్లీనింగ్‌ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. వీటిని లెన్సులకు ఇరువైపులా స్ప్రే చేసి.. మైక్రోఫైబర్‌ క్లాత్‌తో తుడిస్తే సరిపోతుంది. దీనివల్ల దుమ్ము-ధూళితో పాటు జిడ్డు మరకలు కూడా వదులుతాయి.

⚛ స్ప్రే అందుబాటులో లేనప్పుడు గోరువెచ్చటి నీటితో కూడా కళ్లద్దాల్ని శుభ్రం చేయచ్చు. ఆపై పొడిగా తుడవడానికి మాత్రం మైక్రోఫైబర్‌ క్లాత్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

⚛ అలాగే రోజుకోసారైనా కళ్లద్దాల్ని శుభ్రం చేయాలి.

⚛ కొంతమంది కళ్లద్దాల్ని సబ్బునీటితో, డిష్‌వాషింగ్‌ క్లీనర్స్‌తో రుద్ది మరీ కడుగుతుంటారు. ఇది కరక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని హానికారక రసాయనాలు లెన్సుల యాంటీ-గ్లేర్‌, యాంటీ-రిఫ్లెక్టివ్‌ కోటింగ్స్‌తో పాటు అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కల్పించే కవచాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. ఫలితంగా కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.

⚛ కళ్లద్దాల్ని కేస్‌లో పెట్టినా, బయట పెట్టినా లెన్సులు పైకి ఉండేలా చూసుకోవాలి. లేదంటే వాటిపై గీతలు, మరకలు పడే ప్రమాదం ఉంటుంది.

⚛ అలాగే వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో వేసినా, వార్డ్‌రోబ్‌లో ఉంచినా.. నేరుగా అలా పడేయడం కాకుండా.. కళ్లద్దాల కేసులో పెట్టడం తప్పనిసరి! ఫలితంగా లెన్సులపై గీతలు పడకుండా ఉంటుంది. అలాగే ఫ్రేమ్స్‌ కూడా డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఎండ పడే చోట కళ్లద్దాల్ని అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు, వేడి.. లెన్సుల కోటింగ్‌ని దెబ్బతీస్తాయి.

⚛ కొంతమంది స్టైలిష్‌గా ఒక చేత్తోనే కంటికి అద్దాలు పెట్టుకోవడం, తీయడం.. వంటివి చేస్తుంటారు. ఇది కరక్ట్‌ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్లద్దాల ఫ్రేమ్‌ ఆకృతి దెబ్బతింటుందంటున్నారు. అందుకే రెండు చేతులతో అద్దాలు పెట్టుకోవడం, తీయడం చేయాలని చెబుతున్నారు.

⚛ హెయిర్‌ స్ప్రే, పెర్‌ఫ్యూమ్స్‌, నూనె సంబంధిత ఉత్పత్తులు, హోమ్‌ క్లీనర్స్‌.. వంటివి కళ్లద్దాలకు దూరంగా ఉంచాలి. లేదంటే ఇవి పొరపాటున లెన్సులపై పడితే మొండి మరకలుగా మారతాయి. అంతేకాదు.. అద్దాల నాణ్యతా దెబ్బతింటుంది.

⚛ ఇక రోజంతా కళ్లద్దాలు ఉపయోగించి.. రాత్రి పడుకొనేటప్పుడు వీటిని తీయడం కామనే! ఇలాంటప్పుడూ అద్దాల కేసులోనే వాటిని అమర్చడం మంచిది. తద్వారా వాటిపై దుమ్ము-ధూళి చేరకుండా, గీతలు పడకుండా జాగ్రత్తపడచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.